బంగారు తెలంగాణ సంగతి ఏమిటో గానీ బంగారం లాంటి పొలాలను ఇళ్లను తాకట్టు పెట్టి ఓ పోలీస్ దగ్గర అప్పు తీసుకున్న వాళ్లకు దిక్కెవరో తెలియడం లేదు. అడ్డగోలు వడ్డీలతో పీల్చిపిప్పి చేసిన ఎఎస్ఐ లీలలు ఇటీవల కథలు కథలుగా మీడియాలో వచ్చాయి. ఎంతో మంది పోలీసు, ఇతర శాఖల అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ అక్రమ సొమ్మును సదరు ఎఎస్ఐ ద్వారా వడ్డీలకు తిప్పుతున్నారని కూడా పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి.
కరీంనగర్ లో ఎఎస్ఐ మోహన్ రెడ్డి అరాచకాలు శ్రుతిమించాయి. అతడి దగ్గర వడ్డీ తీసుకుని తిరిగి చెల్లించినా, ఓ రైతులు వేధింపులు తప్పలేదు. దీంతో ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 లక్షల రూపాయల అప్పు తీసుకున్న నారాయణ రెడ్డి అనే రైతు, తన ఎకరంనర పొలాన్ని తాకట్టు పెట్టాడు. ఈమధ్య అప్పు మొత్తం వడ్డీతో సహా చెల్లించాడు. అయినా అతడి పొలం కాగితాలను ఎఎస్ఐ ఇవ్వడం లేదు. ఇంకా డబ్బు ఇవ్వాలని, లేకపోతే ఊరుకునేది లేదని బెదిరించాడు. దీంతో ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎఎస్ఐ కారణమని సూసైడ్ నోట్ రాసి తనువు చాలించాడు. అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పిన వివరాలివి.
అరాచక పోలీసు అధికారి ఆగడాలకు బలైన బాధితుల్లో ఈ రైతు మొదటి వాడు కాదు. గతంలో చాలా మంది ఈ అరాచకాలను భరించలేక బాధపడ్డారు. ఇంతకు ముందు ఇలాగే ఓ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడం లేదని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ అరాచక పోలీసు బాధితులు వేలల్లో ఉన్నారు. చివరకు వాళ్లంతా కలిసి ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని న్యాయం కోసం పోరాడుతున్నారంటే ఆ పోలీస్ ఎంత ఖతర్నాకో అర్థమవుతుంది. అతడిని సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని వారు ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు తమ సాటి పోలీసు ఆగడాలను అరికట్టలేనప్పుడు ప్రభుత్వం ఏంచేస్తోంది? మీడియాలో రోజుల తరబడి కథనాలు వచ్చినా, ఆ పత్రికలను గానీ న్యూస్ చానళ్లను గానీ చూడలేనంత బిజీగా ఉన్నారా ముఖ్యమంత్రి, మంత్రులు? ప్రజల నుంచి, పార్టీ వారినుంచి కూడా ఈ సమాచారం ముఖ్యమంత్రికి ఇప్పటిదాకా తెలియదా? ఒక ఎఎస్ఐ కరీంనగర్లో జన జీవితాల్లో అల్లకల్లోలం సృష్టిస్తుంటే ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదా? శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ నాయకుడిగా ముఖ్యమంత్రిదే. కేవలం ఒక్క ఎఎస్ఐ ఇన్ని అరాచకాలకు పాల్పడ్డాడని పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా కనీసం హోం మంత్రి గానీ, ఆ జిల్లాకు చెందిన మంత్రులు గానీ, ఆ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి పుత్రుడు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇంకా ఎంత మంది మరణిస్తే ఈ ప్రభుత్వం స్పందిస్తుందని కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి ఏం జవాబు చెప్తారో?
