గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ ప్రకంపనలు రేపుతోంది. అతడి డైరీలో ఉన్న పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, జర్నిస్టులు, ఇతర రంగాల ప్రముఖులు పేర్లపై ఊహాగానాలు వినవస్తున్నాయి. పోలీసులు మాత్రం అప్పుడే వివరాలు బయటకు చెప్పకుండా డైరీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా నయీంతో కలిసి భోజనం చేయడమే కాదు, కొందరు అతడి ముందు చేతులు కట్టుకుని నిల్చుంటాని కూడా టాక్.
గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, మాజీ నక్సలైట్ నయీంను మాఫియా డాన్ గా మార్చింది పోలీసులే. చివరకు ఎన్ కౌంటర్లో హతమార్చిందీ పోలీసులే. భువనగిరి నయీం అంత్యక్రియల సందర్భంగా అతడి తల్లి పోలీసులకు శాపనార్థాలు పెట్టారు. స్వార్థం కోసం అతడిని పోలీసులు వాడుకుని చంపేశారని అతడి బంధువులు కొందరు ఆరోపించారు.
తెలుగుదేశం హయాంలో ఓ అత్యున్నత పోలీసు అధికారి నయీం అనే మాఫియా డాన్ శిల్పాన్ని చెక్కిన రూపశిల్పి అంటారు. నక్సలైట్ల ఏరివేతకు ఇన్ పార్మర్ గా తయారు చేయడం అనే నెపంతో సెటిల్ మెంట్ల కింగ్ గా మలచాడట. బెదిరింపులు, కబ్జాలు, కిడ్నాపులు, హత్యలు చేసినా ఏమీ కాదనే ధైర్యం ఇవ్వడం వల్లే నయీం ఈ స్థాయిలో రెచ్చిపోయాడనేది మీడియా కథనాల సారాంశం.
హైదరాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లో పోలీసు అధికారులకు నయీం నజరానాగా ఇచ్చిన స్థలాలే వందల ఎకరాల్లో ఉంటాయట. ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, కార్లు, బంగళాలు, బంగారం వగైరా కానుకులను పోలీసులకు ఇచ్చే వాడట. అంతేకాదు, అతడిని అడ్డంపెట్టుకుని దందాలు చేసిన వారు, అడ్డు తొలగించుకోవాల్సిన వారిని నయీం చేత హత్య చేయించిన వారు కూడా ఉన్నారట.
నయీం ఎన్ కౌంటర్ తో అతడి కబ్జాలోని భూములను వాటి యజమానులు సొంతం చేసుకోవచ్చా అనేది ప్రశ్న. ఆ అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. నయీం దోస్తీతో కోట్లకు పడగలెత్తడం అనే అక్రమ సంపాదన రుచి మరిగిన కొందరు మరో డాన్ ను తయారు చేసినా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది. అక్రమ సంపాదనకు ఎవరో ఒకరని అడ్డుపెట్టుకోవాలని కాబట్టి, ఈ హడావుడి తగ్గిన తర్వాత నయీం వారసుడిగా, లేదా కొత్త డాన్ గా మరో గ్యాంగ్ స్టర్ పుట్టుకు రాడనే గ్యారంటీ లేదనే టాక్ ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పోలీస్ స్పాన్సర్డ్ డాన్ పద్ధతికి చెక్ పెట్టక పోతే మరో నయీం త్వరలోనే తెరమీదికి రావచ్చు.
