ఏపికి ప్రత్యేక హోదా బదులు అంతకంటే ఎక్కువ లబ్ది కలిగించే విధంగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వబోతున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మీడియాకి తెలిపారు. అతి త్వరలోనే రాష్ట్ర ప్రజలు ప్రత్యేక ప్యాకేజిపై శుభవార్త వింటారని జైట్లీ చెప్పారు.
ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు కేంద్రపధకాలకి 90 శాతం నిధులు అందుతాయని, ఏపిలో ఇప్పటికే చాలా పధకాలకి 90 శాతం నిధులు అందిస్తున్నామని, మిగిలిన కొన్ని పధకాలకి 60 శాతం నిధులు అందిస్తున్నామని తెలిపారు. ఆ మిగిలిన పధకాలకి కూడా 30శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఏవిధంగా ఇవ్వాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇదివరకు ఇచ్చిన పారిశ్రామిక రాయితీలకి అదనంగా మరికొన్ని ఇవ్వబోతున్నామని చెప్పారు.
రాష్ట్రానికి అవసరమైన సహాయసహకారాలు, ప్రోత్సాహకాలు ఎంతైనా అందించడానికి సిద్దంగా ఉన్నామని కానీ నిర్దిష్టంగా ప్రత్యేక హోదా అనే పేరుతోనే సహాయం చేయడానికి ఇబ్బందులు ఉన్నందునే తాము ఆ పేరుని వాడలేకపోతున్నామని భాజపా చాలాసార్లు స్పష్టం చేసింది. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మళ్ళీ అదే విషయం మరోసారి చెప్పారు అంతే! రాష్ట్రంలో ప్రతిపక్షాలు, మిత్రపక్షం ఒత్తిడి కారణంగా అదనంగా మరికొన్ని నిధులు, పారిశ్రామిక సబ్సీడీలు మంజూరు చేయడానికి అంగీకరించినట్లు స్పష్టం అవుతోంది.
ఏపికి ప్రత్యేక హోదా పేరుతో సహాయం చేస్తున్నట్లు ప్రకటిస్తే, దాని కోసం చాలా ఏళ్లుగా పోరాడుతున్న రాష్ట్రాలు కూడా కేంద్రప్రభుత్వంపై దాని కోసం ఒత్తిడి చేయవచ్చు. అలాగే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే తమ రాష్ట్రంలో పరిశ్రమలు అక్కడికి తరలి వెళ్లిపోతాయని భయపడుతున్న కొని రాష్ట్రాలు కూడా అభ్యంతరం చెప్పవచ్చు. ఇటువంటి కారాణాలు, సాంకేతిక అవరోధాలు చాలా ఉన్నందునే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతోంది.
ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, అందుకు తీసిపోని విధంగా పారిశ్రామిక రాయితీలు, ఆర్ధిక సహాయం చేస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెపుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులని కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్రం అందిస్తున్న ఈ ప్యాకేజిని స్వీకరించి రాష్ట్రాభివృద్ధి చేసుకోవడమే విజ్ఞత అనిపించుకొంటుంది.
రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాయే కావాలని పట్టుబడుతూ ప్రజలని రెచ్చగొట్టి ఉద్యమాలకి సిద్దం అయితే ప్రజలు వాటికి సహకరిస్తే చివరికి రాష్ట్రం, ప్రజలే నష్టపోతారు తప్ప అవి కావు. రాష్ట్ర విభజన సమయంలో అది అనివార్యమని తెలిసి ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ప్రజలని తప్పు ద్రోవ పట్టించినందున రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో కళ్ళారా చూస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ అదేవిధంగా ప్రజలని తప్పుద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయాయి. వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలు, సమీకరణాలు, బలాబలాలు ఏవిధంగా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. కనుక తెగే వరకు తాడు లాగడం కంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం విజ్ఞత అనిపించుకొంటుంది.
