ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం వివిధ పద్దుల క్రింద సుమారు రూ.1.60 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా నేతలు వాదిస్తున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అదే చెప్పారు. జైట్లీ ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ‘మిగిలిన అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్లే ఇచ్చింది తప్ప ఏపికి అధనంగా ఏమి ఇచ్చిందని’ ప్రశ్నించారు. అంటే ఏపికి కేంద్రప్రభుత్వం రూ.1.60 లక్షల కోట్లు ఇచ్చిందని ఆయన దృవీకరించినట్లు స్పష్టం అవుతోంది. కానీ తెదేపా ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణం నాయుడు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, చంద్రశేఖర్ లు నిన్న చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ నిధుల విడుదల గురించి భాజపా అబద్దాలు చెపుతోందని ఆరోపించారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి రూ.1.50 లక్షల కోట్లు ఇచ్చామనే అబద్దపు ప్రచారాన్ని మానుకోవాలని వారు భాజపాకి హితవు పలికారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన మాటలని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్రువీకరిస్తున్నప్పుడు, తెదేపా ఎమ్మెల్సీలు మళ్ళీ ఈవిధంగా ఎందుకు మాట్లాడటం చూస్తే తెదేపా నేతలకే దీనిపై స్పష్టత లేదని అర్ధమవుతుంది.
కేంద్రప్రభుత్వం తమ రాష్ట్రానికి రూ.70,000 కోట్లు ఇచ్చిందని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ సభలో ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పారు. ఆర్ధికంగా బలంగా ఉన్న తెలంగాణా రాష్ట్రానికే కేంద్రప్రభుత్వం అంత డబ్బు ఇస్తున్నప్పుడు, విభజన కారణంగా దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్ కి రూ.1.60 లక్షల కోట్లు ఇచ్చి ఉంటే అదేమీ ఆశ్చర్యం కాదు. అది సహజం కూడా. తెదేపా ఎమ్మెల్సీలు ఆ విషయమే చెప్పుకొంటే చాలా హుందాగా ఉండేది. కానీ కేంద్రప్రభుత్వం అందిస్తున్న నిధులు అందుకొంటూనే అందలేదని చెప్పడం వలన తెదేపా-భాజపాల సంబంధాలు చేడుతాయి. అంతే కాదు..కేంద్రప్రభుత్వం అంత డబ్బు ఇస్తుంటే ఆవిషయం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోంది? దానిని ఎక్కడ దేని కోసం ఖర్చుపెడుతోంది? అని రాష్ట్ర ప్రజలలో కూడా అనుమానాలు కలుగుతాయి. కనుక కేంద్రం నుంచి అందుకొన్న నిధుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ, దానిని దేనికోసం ఎంత ఖర్చు చేస్తున్నామనే సంగతి ప్రజలకి తెలియజేస్తే బాగుంటుంది.
