బాహుబలికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ వచ్చినప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి ఎంపికైనప్పుడు వచ్చినన్ని విమర్శలు బహుశా ఇంతకుముందెన్నడూ రాలేదేమో. సినిమా ఎలా ఉంది? బాహుబలికి ఎందుకు అర్హత లేదు? అనే విషయం పక్కన పెడితే ఏం చూసి జాతీయ అవార్డ్ ఇచ్చారన్నది మాత్రం చాలా పెద్ద పజిల్. బాహుబలి సినిమాలో పూర్తి కథ లేదు. సగం కథతో వచ్చిన సినిమా. అద్భుతమైన నటన కూడా ఏమీ లేదు. అద్భుతమనిపించే విజువల్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్ ఉన్నాయి. వాటిని చూసి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డ్ ఇవ్వడం అంటే అవార్డ్‌ని నవ్వుల పాలు చేయడమే. కమర్షియల్ సూపర్ హిట్ సినిమాలకు జాతీయ అవార్డ్ ఇవ్వకూడదా? అని కొంతమంది అడుగుతున్నారు. బహుళ జనాదరణ పొందడమే జాతీయ అవార్డులు గెలుచుకోవడానికి ప్రామాణికం అయితే ఇక జడ్జ్‌లు, సెలక్షన్స్ కోసం నియమాలు, నిబంధనలు లాంటి హంగామా ఎందుకు? డైరెక్టుగా ఆడియన్స్ పోల్కి వెళ్ళిపోవచ్చు కదా. బాహుబలి సినిమాకు జాతీయ అవార్డు వచ్చినందుకు ఓ తెలుగువాడిగా గర్వపడదాం అనే సెంటిమెంట్ పూతను పూయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. నిజాయితీగా వచ్చి ఉంటే గర్వంగా ఫీలవ్వమని ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు.
బాహుబలి సినిమాకు జాతీయ అవార్డు రావడమే విచిత్రం అనుకుంటే ఇప్పుడు రుద్రమదేవి సినిమాను ఇండియా తరపున బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డు కోసం ఆస్కార్ అవార్డ్స్‌కి పంపాలని నిర్ణయించడం మరింత షాకింగ్‌గా ఉంది. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే తెలుగు సినిమాల స్థాయి పెరిగిందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. కానీ ఆలోచిస్తే మాత్రం లాబీయింగ్ స్టాండర్డ్స్ పెరిగి ఉంటాయి అన్న వాస్తవం తెలిసొస్తోంది. వారసుడు లేకపోతే వారసురాలినే పురుషుడి రూపంలో పెంచి పెద్ద చేసి రాజ్య బాధ్యతలను అప్పగించొచ్చన్న గొప్ప ఐడియాను ప్రపంచానికి మనమే నేర్పించాం అనేలా రుద్రమదేవి సినిమాలో ఓ పాయింట్ ఉంటుంది. ఆ ఒక్క పాయింట్‌ని మెచ్చి ఈ సినిమాను ప్రపంచ దేశాల వాళ్ళు చూడాలి. మన గొప్పతనం ఏంటో వాళ్ళకు తెలియాలి అన్న ఆకాంక్షతో రుద్రమదేవి సినిమాను ఆస్కార్‌కి ఎంపిక చేశారేమో తెలియదు. కానీ మన గొప్పదనాన్ని గుర్తించేలా చేయడంలో ‘రుద్రమదేవి’ సినిమా ఎంత వరకూ విజయవంతమవుతుందో తెలియదు కానీ మన సినిమాలు ఏ ‘స్థాయి’లో ఉన్నాయి అన్న విషయం మాత్రం ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్, కథ, కథనం, క్యారెక్టరైజేషన్స్‌లో ఉన్న లోపాలు అన్నీ కూడా చూసినవాళ్ళందరికీ అర్థమవుతాయి. ఇండియాలో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి ది బెస్ట్ సినిమా అని వాళ్ళు ఫీలయిన సినిమానే ఇలా ఉందంటే ఇక మిగతా సినిమాలు ఎలా ఉంటాయో అని ఊహించుకుని నవ్వుకోవడానికి మాత్రం ‘రుద్రమదేవి’ సినిమా ఉపయోగపడుతుంది.
నిజంగా ఆ స్థాయి ఉన్న తెలుగు సినిమాలకు మాత్రం ఎప్పుడూ అవార్డ్స్ రాలేదు. ఇప్పుడు మాత్రం స్థాయి లేకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా తెలుగు సినిమా పేరు మోగిపోతోంది. ‘అన్నమయ్య’ సినిమాకు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ గెలుచుకున్న కీరవాణి ఓ సందర్భంలో చెప్పారు… ‘అన్నమయ్య సినిమాను తీసిన నిర్మాతలు చాలా చాలా కష్టపడి నార్త్ వాళ్ళ లాబీయింగ్ తట్టుకుని మరీ అవార్డ్ వచ్చేలా చేశారుగానీ ప్రతిసారీ ప్రతిభకు పట్టం కట్టే పరిస్థితులు అస్సలు ఉండవు. అందుకే మళ్ళీ ఎప్పుడూ ఆ అవార్డ్ కోసం ప్రయత్నం కూడా చేయలేదు’ అని. ఇప్పుడదే లాబీయింగ్ విషయంలో మనవాళ్ళు స్ట్రాంగ్ అయినట్టున్నారు. తెలుగు క్లాసిక్ హిట్స్, బెస్ట్ ఎవర్ ఫిల్మ్స్‌కి ఈ అవార్డ్స్ వచ్చి ఉంటే…..అలాంటి సినిమాలు తీసిన మనవాళ్ళు ఈ లాబీయింగ్ విషయాల్లో విజయవంతం అయి ఉంటే ఎంత గొప్పగా ఉండేదో కదా అన్న భావన మాత్రం మదిని తొలుస్తోంది.
