ప్రపంచంలో చైనా తరువాత అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్. కానీ ఒలింపిక్స్ క్రీడలలో చాలా అరుదుగా పతకాలు సాధిస్తుంటుంది. చిన్న చిన్న దేశాలు కూడా బంగారు పతకాలు సాధిస్తుంటే 125కోట్లు జనాభా ఉన్న భారత్ మాత్రం పతకాలు ఎందుకు సాధించలేకపోతోంది? అనే ప్రశ్న తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ఒలింపిక్స్ క్రీడలలో పతకాలు రాకపోవడానికి చైనాకి చెందిన టౌటియో.కామ్ అనే వెబ్ సైట్ 8 ప్రధాన కారణాలు కనుగిఒని చెప్పడం విశేషం.
అవేమిటంటే 1.పేదరికం,2. బలహీనమైన ప్రజారోగ్యం 3.మౌలికవసతుల కొరత 4.తల్లితండ్రులు అందరూ తమ పిల్లలు ఇంజనీర్లో లేదా డాక్టర్లో కావాలని కోరుకోవడం 5.క్రికెట్ కి మాత్రమే ఆదరణ 6.హాకీ ప్రాధాన్యత కోల్పోవడం 7. క్రీడలలో బాలికలని అనుమతించకపోవడం 8.గ్రామీణ ప్రాంతాలలో అసలు ఒలింపిక్స్ అంటేనే తెలియక పోవడం.
వీటిలో ఏ ఒక్క కారణాన్ని కాదనలేము. ఇవేకాక కులం, మతం కట్టుబాట్లు, ప్రజలకి, ప్రభుత్వాలకి క్రీడలపట్ల చిన్న చూపు వంటి సవాలక్ష కారణాలు కూడా వినిపిస్తుంటాయి. పతకాలు సాధించలేకపోవడానికి కారణాలు ఇవీ అని ఖచ్చితంగా తెలిసి ఉన్నప్పటికీ ఆ లోపాలని ఎందుకు సవరించుకోలేకపోతున్నామని ప్రభుత్వాలు కూడా ఎన్నడూ ఆలోచించవు. ఎందుకంటే వాటికి క్రీడాలంటే తెల్ల ఏనుగు వంటివనే నిశ్చితాభిప్రాయం ఉంటుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో క్రీడా శాఖలు వాటికి మంత్రులు, వందలాది మంది అధికారులు, ఉద్యోగులు వగైరా అందరూ ఉంటారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ప్రభుత్వాలని నడిపే రాజకీయ పార్టీల దృష్టి ఎప్పుడూ ఐదేళ్ళకోసారి వచ్చే దేశీయ రాజకీయ ఒలింపిక్స్ పైనే ఉంటుంది. వాటిలో గెలిచేందుకు ఎంత డబ్బైన వెదజల్లడానికి వెనకాడవు. ఒకవేళ అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ ఒలింపిక్స్ పెడితే బంగారు పథకాలన్నీ మనకే వచ్చేస్తాయేమో?
