తెలుగుదేశం పార్టీకి మళ్ళీ చాలా కాలం తరువాత జూ.ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారని గుర్తొచ్చింది. మంత్రి పల్లె రఘునాధ రెడ్డి స్వయంగా జూ.ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయనని కృష్ణా పుష్కరాలకి ఆహ్వానించారు. జూ.ఎన్టీఆర్ ఆయన ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా పుష్కరాలకి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. జూ.ఎన్టీఆర్ ని 2014 ఎన్నికలలో తెదేపా తరపున ప్రచారం కోసం కూడా ఆహ్వానించలేదు. గోదావరి పుష్కరాలకి కూడా ఆహ్వానించలేదు. ఆ తరువాత అమరావతి శంఖుస్థాపనకి ఆహ్వానించలేదని వినికిడి. అయినప్పటికీ ఆయన ఆ కార్యక్రమానికి ఒక సామాన్య పౌరుడుగా హాజరయ్యారు. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత కృష్ణా పుష్కరాలకి ఆహ్వానించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికలు వైకాపాకి జీవన్మరణ సమస్య వంటివి కనుక తెదేపాకి దాని నుంచి చాలా గట్టి పోటీ ఉంటుంది. వచ్చే ఎన్నికల వరకైనా భాజపాతో స్నేహం కొనసాగుతుందో లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ అది తెదేపాతో తెగతెంపులు చేసుకొంటే అది వైకాపాతో చేతులు కలిపితే వాటి నుంచి ఇంకా గట్టిపోటీ ఉంటుంది. కనుక 2019 ఎన్నికల వైతరిణి సురక్షితంగా దాటాలంటే తెదేపా కూడా సర్వశక్తులు కూడగట్టుకొని యుద్ధానికి సిద్దం కావలసి ఉంటుంది. కనుక ఆ ప్రయత్నంలోనే మళ్ళీ జూ.ఎన్టీఆర్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందేమో? ఏమో?
