బ్యాంక్ రిజర్వ్ గవర్నర్ రఘురామ రాజన్ పై భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఆయనని తక్షణమే పదవిలో నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఆయనపై భాజపా ఎంపియే అంత తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, అమిత్ షా లేదా మరెవరూ గట్టిగా వారించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. అందుకు ఆయన కూడా చాలా నొచ్చుకొని మళ్ళీ మరోసారి తన పదవీ కాలం పొడిగింపు కోసం కోరనని చెప్పిన తరువాతే ప్రధాని మోడీ స్వామిని సున్నితంగా హెచ్చరించారు. అప్పుడే స్వామి అయిష్టంగా తన నోటికి తాళం వేసుకొన్నారు.
ఆయన తనపై ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినా, కేంద్రప్రభుత్వం తనకి అండగా నిలబడకపోయినా రఘురామ రాజన్ ఏమాత్రం తొణకకుండా తన బాధ్యతలని నిర్వర్తించుతున్నారు. ఆయన సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆ సందర్భంగా ఒక బిజినెస్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా హుందాగా తన మనసులో బాధని, తన పనితీరు గురించి చెప్పారు.
ద్రవ్యోల్బణం కట్టడి కోసం తను చేసిన ప్రయత్నాలని స్వామి తప్పు పట్టినప్పటికీ అవే సరైన విధానమని స్పష్టం చేశారు. ఏమి చేస్తే దేశ ఆర్ధిక వ్యవస్థకి మేలు జరుగుతుందో అదే తాను చేశానని చెప్పారు. ఆ ప్రయత్నంలో తనపై వచ్చిన ఆరోపణలని విమర్శలని పట్టించుకోలేదని, పట్టించుకొంటే ముందుకి వెళ్ళడం సాధ్యం కాదని అన్నారు. దాదాపు 90-95శాతం పనులు పూర్తి చేశానని అందుకు కేంద్రప్రభుత్వంతో సహా అందరూ తనకి చాలా సహకరించారని చెప్పారు. బ్యాంకుల మొండి బకాయిల సమస్యని పరిష్కరించడానికి తాను చాలా కృషి చేశానని ఆ పని ఇంకా పూర్తి కావలసి ఉందని అన్నారు. తను పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేయబోతున్నానని చెప్పారు. వృత్తి రీత్యా తను అధ్యాపకుడినని కనుక మళ్ళీ ఆ వృత్తినే చేపట్టాలనుకొంటున్నట్లు చెప్పారు. కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ఇంతవరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లుగా బాధ్యతలు చేపట్టినవారందరూ మన దేశ ఆర్ధిక వ్యవస్థని చాలా బలోపేతం చేశారు. జాతీయ స్థాయిలో రాజకీయ అస్తిత్వం ఏర్పడినప్పుడు కూడా దేశ ఆర్ధిక వ్యవస్థ ఎప్పుడూ స్థిరంగానే కొనసాగుతోంది. అమెరికాలో ఆర్ధిక మాంద్యం ఏర్పడినప్పుడు, ఇటీవల ప్రపంచ మార్కెట్లు కుప్పకూలినప్పుడు కూడా భారత్ ఆర్ధిక వ్యవస్థ చెక్కు చెదరలేదు. అంటే రఘురామ రాజన్ న్ని కూడా చాలా సమర్ధంగా పనిచేశారని స్పష్టం అవుతోంది. అటువంటి వ్యక్తిని గౌరవించకపోగా ఆయన సేవలని, నైపుణ్యాన్ని, దేశభక్తిని శంకిస్తూ సుబ్రహ్మణ్య స్వామి చాలా అవమానకరంగా మాట్లాడటం, దానిని ప్రధాని నరేంద్ర మోడీ ఖండించకపోవడం చాలా బాధాకరమే. ఆయన చాలా సంతృప్తిగా పదవీ విరామణ చేస్తున్నట్లు చెప్పుకొంటున్నప్పటికీ స్వామి చేసిన అనుచిత వ్యాక్యలు ఆయనకి ఎన్నటికీ మరిచిపోలేని అసంతృప్తిని మిగిల్చే ఉంచుతాయి.
