వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణంతో ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాడు జగన్. వైఎస్ ఉండి ఉంటే, అధికారంలో ఉండి ఉంటే, వారసుడిగా జగన్‌ని ముఖ్యమంత్రిని చేయడమనే కార్యక్రమం చాలా సున్నితంగానే జరిగిపోయి ఉండేది. కానీ వైఎస్సార్ మరణం, ఆయన శతృవులు యాక్టివ్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం దశాబ్ధాల తరబడి కాచుకుని ఉన్న నాయకులు చాలా మంది ఉండడం…అన్నిటికీ మించి ఆవేశం, అహంభావం చాలా ఎక్కువగా ఆవహించి ఉండే వైఎస్ జగన్మోహన్రెడ్డి… సోనియాగాంధీ దగ్గర కూడా తలెగరేయడం లాంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవ్వాలన్న జగన్ ఆశలను అడియాసలు చేశాయి. ముఖ్యమంత్రి అవ్వడం కోసమే ఊపిరికి ఊపిరి అల్లుకుని బ్రతుకుతున్నట్టుగా కనిపించే జగన్ ఆ పరిణామాన్ని భరించలేకపోయాడు.
ఆవేశంగా బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టేసుకున్నాడు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి తెలిసినవాళ్లు, ఇండియన్ పాలిటిక్స్‌లో సానుభూతి రాజకీయ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అవగాహన ఉన్నవాళ్లందరూ కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతాడని నమ్మారు. ఆయన వెంట నడిచారు. ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తూ వైసిపి అభ్యర్థులు ఘనవిజయాలు సాధించడంతో మామూలుగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైన జగన్‌కి విశ్వాసం మరీ ఎక్కువైంది. అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని వనరులను చంద్రబాబు సమర్థంగా వాడుకోవడం, అతి విశ్వాసంతో ఉన్న అవకాశాలను కూడా జగన్ చెడగొట్టుకోవడం కలిసి జగన్‌ని నట్టేట్లో ముంచాయి.
ఓడిపోవడానికి గల కారణాలను జగనే చాలా సార్లు చెప్పాడు. కానీ అవన్నీ కేడర్ కోసం, జనాలను నమ్మించడం కోసం చెప్పిన మాటలు. ఆ మాటల్లో నిజానిజాల విషయం పక్కన పెడితే వైఎస్. జగన్మోహన్రెడ్డికి, వైసిపి వ్యూహకర్తలకు ఓ కారణం మాత్రం చాలా బలంగా కనిపించింది. అదే హిందూ వ్యతిరేకత. స్వయంగా తల్లి విజయమ్మ చేత బైబిల్ చేతపట్టించి ప్రచారం చేయించడం… ఆ వర్గం ఓట్ల వరకూ బాగానే కలిసొచ్చింది కానీ హిందువుల విషయంలో మాత్రం అదే ప్రచారం వ్యతిరేక ఓట్లకు కారణమయిందని జగన్ నమ్ముతున్నాడు. 2014లో ఏ వర్గం ప్రజలకైతే తను దూరమయ్యాడో వాళ్ళందరికీ కూడా మళ్లీ దగ్గరవ్వాలని తపిస్తున్న జగన్…ఇప్పుడు ‘మిషన్ హిందూత్వ’ అనే యజ్ఙంలో ఉన్నాడు. తెదేపా, బిజెపిల బంధం ఏ క్షణమైనా బద్ధలయ్యే అవకాశాలు కూడా జగన్‌కి కనిపిస్తుండడతో బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఈ వేషం పనికొస్తుందని భావిస్తున్నాడు. అలాగని జగన్ పార్టీకి బాగా పట్టున్న వర్గం ఓట్లు పోతాయని భయపడాల్సిన అవసరం కూడా జగన్‌కి లేదు. ఆ ఓట్ల కోసం బైబిల్ పట్టుకుని ప్రచారం చేయడానికి విజయమ్మ ఎలాగూ రెడీ అయిపోతుంది.
చంద్రబాబును విమర్శించే ప్రతి సందర్భంలోనూ ఓ మాట చెప్తుంటాడు జగన్. చంద్రబాబువి వయసైపోయిన రాజకీయాలు, అవుట్ డేటెడ్ పాలిటిక్స్.. నాది యువ రాజకీయం అని చెప్తూ ఉంటాడు. నాకు పాతవాసనలు లేవు. కొత్తగా అభ్యుదయ రాజకీయం వైపు అడుగులేస్తున్నానన్న భావన వచ్చేలా తనకు తోచినట్టుగా మాటలు చెప్తూ ఉంటాడు. కానీ చేతల్లో మాత్రం కులాలు, మతాలను నమ్ముకుని చెత్త రాజకీయం చేస్తూ ఉంటాడు. ఇలాంటి రాజకీయం ఎవరు చేసినా తప్పే. అందరూ ఇదే చేస్తున్నారన్నమాట కూడా వాస్తవం. పదవి కోసం మరీ ఈ స్థాయికి దిగజారడం అయితే భావ్యం కాదు. ఆరెస్సెస్ కంటే కూడా నేనే పెద్ద హిందూత్వ వాదిని అని అనిపించుకునే ప్రయత్నాల్లో చంద్రబాబు గుళ్ళూ, గోపురాలు, పుష్కరాలు అంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే, ఇప్పుడు వైఎస్ జగన్ కూడా చంద్రబాబును మించిన వాడిని నేను అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.
చివరిగా ఒక్క మాట చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసమే జగన్ ఈ కార్యక్రమం చేస్తున్నాడని వైసిపి నేతలు చెప్పారు. సిగ్గుపడాలి….యువతకు ఏం సందేశం ఇస్తున్నారు. మూఢనమ్మకాలకు కూడా ఓ హద్దంటూ ఉండాలి. మూర్ఖత్వానికి కూడా పరిధులు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలతోనే హోదా వచ్చేస్తుందన్న నమ్మకం ఉంటే ఇక అస్తమానూ చంద్రబాబును తిట్టడం ఎందుకు? హిమాలయాలకు వెళ్లి తపస్సు చేస్తూ కూర్చుంటే బాగుంటుంది కదా. అదేమంటే ప్రత్యేక హోదా కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నామంటారు. నరేంద్రమోడీని విమర్శించే దమ్ము, ధైర్యంలేని వాళ్ళు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామనడమే చాలా పెద్ద కామెడీ. అందరూ కలిసి షో చేస్తున్నారు. సీమాంధ్రులకు తమ నటనా నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. కానీ ఇలాంటి నటనలకు, నాటకాలకు మోసపోయే జనాలు ఇంకా ఉన్నారంటారా?
