గత నెలరోజులుగా రావణకాష్టంలాగ రగులుతున్న కాశ్మీర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడారు. మధ్యప్రదేశ్ లో భాబ్రా గ్రామంలో బహిరంగసభలో మాట్లాడుతూ, “ల్యాప్ టాపులు, పుస్తకాలు, క్రికెట్ బ్యాట్లు పట్టుకోవలసిన కాశ్మీరీ యువత చేతుల్లో రాళ్ళు ఉండటం చాలా బాధ కలిగిస్తోంది. కాశ్మీరీ యువత తమ భవిష్యత్ గురించి ఆలోచించాలి. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా వారికి పూర్తి సహాయసహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నాయి. స్వాతంత్ర్యం వలన దేశంలో మిగిలిన రాష్ట్రాలలో ప్రజలు ఏవిధమైన స్వేచ్చా స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నారో కాశ్మీర్ ప్రజలకి కూడా అంతే హక్కు ఉంది. కాశ్మీర్ లో కొందరు తప్ప మిగిలినవారు అందరూ శాంతినే కోరుకొంటున్నారు. అందరం కలిసి కాశ్మీర్ లో శాంతి నెలకొల్పి మళ్ళీ స్వర్గంలా మలుచుకొందాము. మానవత్వం, ప్రజాస్వామ్యం, కాశ్మీరీతత్వం అనే మూడు అంశాలని ప్రామాణికంగా తీసుకొని ఈ సమస్య పరిష్కారానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది ఆనాడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కాశ్మీర్ సమస్యల పరిష్కారానికి ఎంచుకొన్న మార్గంలోనే మేము ఈ సమస్యలకి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాము. కాశ్మీర్ పై కాంగ్రెస్ పార్టీతో సహా దేశం యావత్తు ఒకే గొంతుతో మాట్లాడటం చాలా అభినందనీయం,” అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇదే మాట కాశ్మీర్ లో అల్లర్లు మొదలైనప్పుడే గట్టిగా చెప్పి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. కాశ్మీర్ సమస్యపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రతిపక్షాలు పదేపదే నిలదీసిన తరువాతనే ఆయన నోరువిప్పి మాట్లాడారు. అయితే ఆలశ్యంగా స్పందించినప్పటికీ చాలా చక్కగానే చెప్పారు. కాశ్మీర్ యువతకి చక్కగానే మార్గదర్శనం చేశారు. కాశ్మీర్ లో శాంతి నెలకొల్పడానికి ఇంకా ఇతర ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని విస్పష్టంగా చెప్పారు. దానికోసం మానవత్వం, ప్రజాస్వామ్యం, కాశ్మీరీతత్వం అనే మూడు అంశాలని ప్రామాణికంగా తీసుకొంటున్నట్లు చెప్పారు. అంటే ఇంతవరకు శాంతిభద్రతల కోణంలో నుంచి మాత్రమే ఈ సమస్యని చూస్తున్న ప్రభుత్వం, ఇకపై కాశ్మీర్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించడానికి సిద్దం అని ప్రధాని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పద్దతిలో సమస్య పరిష్కరిస్తామని చెప్పడం అంటే కాశ్మీరీ వేర్పాటువాదులతో చర్చలకి సిద్దం అని సూచిస్తున్నట్లుగా భావించవచ్చు. అలాగే ఈ సమస్యని రాజేస్తున్న పాకిస్తాన్ మళ్ళీ చర్చలకి సిద్దపడుతున్నట్లు భావించవలసి ఉంటుంది.
ఏ సమస్య పరిష్కారానికైనా పట్టువిడుపులు ముఖ్యమే కానీ పాకిస్తాన్ కి జేజేలు పలుకుతున్న వేర్పాటువాదులతో రాజీపడినంత మాత్రాన్న కాశ్మీర్ లో “శాశ్విత శాంతి స్థాపన” సాధ్యమేనా? అంటే కాదనే ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక వారి ముందు భారత ప్రభుత్వం చేతులు కట్టుకొని నిలబడటం సరైన నిర్ణయమో కాదో ప్రధాని నరేంద్ర మోడీయే నిర్ణయించుకోవాలి. అలాగే ఇంతవరకు ఈవిషయంలో పాక్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు దానితోనే చర్చలకి సిద్దం అయితే దాని వాదననే అంగీకరించినట్లు కాదా? భారత్ ఒక మెట్టు దిగి వేర్పాటువాదులతో, పాకిస్తాన్ తో చర్చలకి సిద్దపడినా 60 ఏళ్లుగా మారని వారి బుద్ధి మారుతుందా? ఆలోచించుకోవాలి.
