తూర్పు గోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు కె.కన్నబాబు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిపై చాలా ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదన్న వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దూత లేదా అధికార ప్రతినిధి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. వారిద్దరూ ఒకరికోసం మరొకరు ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ప్రత్యేక హోదా అనేది యావత్ రాష్ట్ర ప్రజలకి సంబంధించిన అంశం. కనుక దాని గురించి వారేది చెపితే అది వినడానికి ప్రజలు సిద్దంగా లేరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా లేదా? అనేది నిర్ణయించుకోవలసింది ప్రజలే కానీ చంద్రబాబు నాయుడో, వెంకయ్య నాయుడో మాత్రం కాదు. వారిద్దరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్లుగా ఇదే విధంగా మాట్లాడితే ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు. వారిద్దరికీ ప్రత్యేక హోదా అవసరం లేకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రజలకి ఉంది. కనుక దానిని సాధించేవరకు వైకాపా పోరాడుతుంది,” అని కన్నబాబు అన్నారు.
ఒకప్పుడు ప్రత్యేక హోదా గురించి వారిద్దరూ చాలా గట్టిగా మాట్లాడారు. కానీ ఆ తరువాత ప్రత్యేక హోదా రాదనే సంగతి స్పష్టం అయినప్పటి నుంచి దాని గురించి రకరకాలుగా మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వలన రాష్ట్రంలో ఆ రెండు పార్టీలకి జరుగుతున్న నష్టం, ఏర్పడుతున్న ప్రజావ్యతిరేకత కంటే దాని గురించి వారిరువురూ మాట్లాడుతున్న మాటల వలననే ఎక్కువ నష్టం కలుగుతోందని చెప్పవచ్చు. దానిపై త్వరలోనే కేంద్రప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకొంటానని స్పష్టం చేస్తున్నప్పుడు, మళ్ళీ వెంకయ్య నాయుడు అది సంజీవిని కాదని చెప్పడం ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. దాని కోసం వైకాపా పోరాడుతోంది కనుక వెంకయ్య నాయుడు అందించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇద్దరికీ చురకలు వేశారనుకోవాలి.
