ప్రధాని నరేంద్ర మోడీ మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు “దళితులని కాదు..నన్ను కాల్చి చంపండి,” అంటూ చాలా నాటకీయంగా చెప్పారు. దళితులపై దాడులు ఖండిస్తున్నానని ఆయన చెప్పదలచుకొన్నారు కానీ దానికి కొంత నాటకీయత జోడించడంతో విమర్శలు మూటగట్టుకొంటున్నారు. ఆయన మాటలపై ఇంకా చర్చలు, విశ్లేషణలు, విమర్శలు సాగుతుండగానే, ఆంధ్రాలో ఇద్దరు దళితులపై మంగళవారం తెల్లవారుజామున దాడి జరిగింది. అది కూడా అచ్చం గుజరాత్ లో జరిగిన విధంగానే జరగడం అనుమానాలకి తావిస్తోంది.
తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పలగుప్తం మండలంలో సుధాపాలెంలో ఈ సంఘటన జరిగింది. స్థానిక వ్యాపారి అరవిందం కరెంటు షాక్ తో చనిపోయిన తన ఆవుని మోకటి ఎలిశా(56), మోకటి వెంకటేశ్వరరావు (53)కి అప్పగించారు. వారిరువురూ దానిని ఊరు బయటకి తీసుకువెళ్ళి దాని చర్మం ఒలుస్తున్నప్పుడు, అకస్మాత్తుగా 8మంది వ్యక్తులు అక్కడికి వచ్చి వారిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. వారిని అడ్డుకోబోయిన ఆటోడ్రైవర్ లవన్ కుమార్ పై కూడా వారు దాడి చేశారు. ఈ సంగతి తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దాడికి పాల్పడిన వారినందరినీ గుర్తించి కేసులు నమోదు చేశారు.
ఈ విషయం తెలుసుకొన్న దళిత సంఘాలు, వామపక్ష కార్యకర్తలు కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిన్న ధర్నా చేసి, ఈ నేరానికి పాల్పడిన దోషులపై కటినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాజపా, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలే ఈ దాడులకి పాల్పడిఉంటారని వారు ఆరోపించడంతో దీనికి రాజకీయ రంగు పులుముకొంది. అయితే దీనికి రాజకీయాలు, కులం కారణం కావని, గత కొంత కాలంగా ఊరులో ఆవులు దొంగతనానికి గురవుతున్నందునే అనుమానంతో ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు చెపుతున్నారు.
ఈ వ్యవహారంలో ఎవరి వాదనలు నిజమో పోలీసుల దర్యాప్తులో తేలవచ్చు. కానీ ఈలోగా ఈ గొడవ చెయ్యి దాటిపోకుండా ప్రభుత్వం తక్షణమే రాజకీయంగా అవసరమైన అన్ని చర్యలు చేప్పట్టడం చాలా మంచిది. దళితులపై ఈవిధంగా దాడులు జరుగడం గట్టిగా ఖండించడమే కాకుండా, అందుకు కారకులైనవారికి చట్ట ప్రకారం శిక్షలు పడేలా చేయాలి. ఈ సంఘటనని చిన్న సమస్యగా భావించి పట్టించుకోకుండా వదిలేస్తే చివరికి ఇది కూడా గుజరాత్ సంఘటనలాగ చిలికి చిలికి గాలివానగా తయారవుతుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర భాజపా నేతలు కూడా చాలా ఇబ్బందిపడవలసి వస్తుంది. కనుక చేతులు కాలక ముందే మేల్కొనడం మంచిది.
