రాజకీయాల వైపు వస్తున్న సినీ స్టార్లకు ఒక విలువైన, ఆలోచనాత్మకమైన సూచన చేశారు జయప్రకాష్ నారాయణ. ప్రత్యేకించి ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కొంతమంది హీరోలు ఆలోచించదగినది ఈ అంశం. సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడానికి స్వాగతిస్తూనే.. వారు తమ గ్లామర్ ను సొమ్ము చేసుకునే లక్ష్యంతో రాజకీయాల్లోకి రాకూడదని జేపీ సూచించారు. ప్రజలకు ఏదైనా మేలు చేసి పెట్టాలన్న లక్ష్యంతో వీరు రాజకీయాల్లోకి రావాలి కానీ.. తమ గ్లామర్ ను ఓట్ల రూపంలోకి మార్చుకొనడానికి రావొద్దని జేపీ స్పష్టం చేశారు.
మరి ప్రస్తుత రాజకీయాల్లో ఎన్నికల సమయంలో యాక్టివ్ గా ఉండి.. మిగతా సమయలో మిన్నకుండి పోతున్న కొంతమంది సినీ రాజకీయ నేతలకు జేపీ మాట ఒక చురకలాంటిదే. తమకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎన్నికల సమయంలో ఉపయోగించుకుని.. ఏదైనా ఒకపార్టీ తరపున ప్రచారం చేస్తూ ఆ కొన్ని రోజులూ పండగ చేసి.. ఆ తర్వాత జనాల కళ్ల ముందుకు రాని, జనాల సమస్యల గురించి పట్టించుకోని సినిమా వాళ్లు ఎంతోమంది మన కళ్ల ముందే కనిపిస్తున్నారు.
ఎవరో ఒకరిని నిందించి ప్రయోజనం లేదు.. ఎన్నికలు దగ్గర పడితే ఎక్కడెక్కడి సినిమా వాళ్లూ లేచొస్తారు. తమ గ్లామర్ ను ఖర్చు పెట్టుకొంటూ జనాల్లోకి వెళ్లి వివిధ పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. వీరిని అభిమానించే వారు కొంతమందైన ఉంటారు కాబట్టి.. అలాంటి అభిమానం ఆయా పార్టీలకు ఓట్లు ట్రాన్స్ ఫర్ అవుతోంది. అయితే అలా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాకా.. వాటి నుంచి ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందుల పరిష్కారానికి మాత్రంఏ ఒక్కరూ ముందుకు రారు. అస్సలు ఎవ్వరూ ఈ రకమైన అంశాల గురించి స్పందించరు కూడా! మరి ఇలాంటి సినిమా వాళ్లు జేపీ చెప్పిన మాట గురించి ఆలోచించాలి.. ప్రజలు కూడా ఈ అంశాన్ని పరిశీలించాలి.
