రాష్ట్ర విభజన కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయింది. చాలా ఇబ్బందులలో ఉంది. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ సాధన కోసం ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలతో రాష్ట్రం ఇంకా వేడెక్కింది. ఇప్పుడు తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు దళితులపై జరిగిన దాడి సంఘటనపై ప్రతిపక్షాలు అధికార తెదేపా, భాజపా, ఆర్ఎస్ఎస్ సంస్థలపై విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం, ధర్నాలకి సిద్దపడుతుండటంతో ఈ సమస్యకి రాజకీయ రంగు పులుముకొంది.
ఈ సంఘటన గురించి దేశవ్యాప్తంగా అన్ని మీడియా చానళ్ళలో ప్రముఖంగా వార్తలు రావడంతో దేశంలో అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఆంధ్రాపై పడింది. కొన్ని మీడియా ఛానళ్ళు నిజానిజాలు తెలుసుకోకుండా చాలా బాధ్యతారాహిత్యంగా ఈ సంఘటన గురించి వార్తలు ప్రచురిస్తుండటంతో సమస్య తీవ్రత ఇంకా పెరిగిపోతోంది.
ఒక స్థానిక వ్యాపారి తన చచ్చిన ఆవుని ఇద్దరు దళిత వ్యక్తులకి ఇస్తే, వారు దాని చర్మాన్ని ఒలుస్తున్నప్పుడు 8మంది స్థానికులు వారిపై అనుమానంతో దాడి చేశారు. ఆ ఊరులో గత నెలరోజులుగా ఆవులు మాయం అవుతున్నాయని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు కూడా నమోదు అయ్యుంది. ఆవు చర్మం ఒలుస్తున్న ఆ ఇద్దరు దళితులే దొంగతనాలకి పాల్పడుతున్నారనే అనుమానంతోనే వారిపై దాడి జరిగింది తప్ప కొన్ని న్యూస్ ఛానళ్ళు, రాష్ట్రంలో ప్రతిపక్షాలు చెపుతున్నట్లుగా తెదేపా, భాజపా కార్యకర్తలు కానీ, 100 మంది గోసంరక్షక్ దళం సభ్యులు గానీ ఈ దాడి జరుపలేదు. రాష్ట్రంలో తెలుగు మీడియా కూడా దీనిని ద్రువీకరిస్తోంది.
ప్రతీ చిన్న సమస్య, ప్రతీ అంశంపై రాజకీయాలు చేయడం అలవాటైపోయిన కొందరు ప్రతిపక్ష నేతలు అలవాటు ప్రకారం తెదేపా, భాజపాలపై విమర్శలు గుప్పిస్తూ దీని నుంచి కూడా రాజకీయ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు ధర్నాలు కూడా చేస్తున్నారు.
రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి సమస్యలపై రాజకీయాలు చేస్తే, దాని వలన రాష్ట్రంలో అశాంతి, ఘర్షణ వాతావరణం ఏర్పడటమే కాకుండా, దేశంలో రాష్ట్రానికి చెడ్డపేరు కూడా వస్తుంది. కనుక ప్రతిపక్షాలు, మీడియా కూడా ఈ వ్యవహారంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మంచిది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు చేపట్టి పరిస్థితులు అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకొంటే మంచిది. తెదేపా, భాజపా నేతలు కూడా దీనిపై రాజకీయాలు చేయకుండా తగు విధంగా స్పందిస్తే మంచిది. ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టలకి, దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన సునితమైన విషయం. కనుక అందరూ ఆచితూచి మాట్లాడటం, వ్యవహరించడం చాలా అవసరం. లేకుంటే పోయేది మన పరువే.
