ఏపీలో ప్రధాన మీడియా వర్గం అంతా తెలుగుదేశం పార్టీకే అండగా ఉంటుందనేది బహిరంగ రహస్యం. ప్రధాన పత్రికలు.. చాలా వరకూ టీవీ చానళ్లు.. తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటాయనే అంశం గురించి ఇది వరకూ అనేక రకాల చర్చ జరిగింది. జరుగుతూనే ఉంది. కొన్ని భయంతో.. మరికొన్ని భక్తితో బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తుంటాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాతావరణంలో ఒక జగన్ సొంత చానల్ “సాక్షి’’ ని పక్కన పెడితే.. మరో చానల్ ఒక అంశంలో బాబు తీరును వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో ప్రజా స్పందనలను తీసుకుని ఆ చానల్ బాబు తీరును నిరసించే ప్రసారాలను చేస్తోంది!
అదొక స్వామీజీ కి సంబంధించిన చానల్. దాదాపు ఏడాది కిందట ప్రారంభం అయిన ఆ చానల్ ప్రధానంగా హిందూ అజెండాతో ముందుకు వెళుతోంది. భారతీయ జనతా పార్టీ అనుకూలమైన కథనాలను ప్రసారం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అందులో. ఇలాంటి నేపథ్యంలో విజయవాడలో గుళ్ల కూల్చివేత అంశం గురించి ఆ చానల్ లో విమర్శనాత్మక కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి.
విజయవాడ పుష్కరాల నేపథ్యంలో.. ఈ అంశాన్ని ఆ చానల్ ఇంకా హైలెట్ చేస్తోంది. హిందూ దేవాలయాలను కూల్చివేసిన ప్రభుత్వాన్ని ఘోరీలతో, గజినిలతో పోలుస్తూ కథనాలు ప్రసారం అవుతున్నాయందులో. ఈ మాటలను ప్రజలతో అనిపిస్తూ ఆ చానల్ లో కథనాలు ప్రసారం అవుతున్నాయి. మిగతా మీడియా ఈ అంశాన్ని అంత హైలెట్ చేయకుండా బాబుకు రక్షించుకు వస్తే.. ఈ చానల్ మాత్రం ఈ అంశంలో బాబు ప్రభుత్వ తీరును తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నట్టుగా ఉంది!
