మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి తెలంగాణా ప్రభుత్వం పంటలకి నీళ్ళు అందించాలనుకొంది. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు దాని నుంచి మంచి రాజకీయ మైలేజ్ లభించే అవకాశం ఉందని పసిగట్టి, నిర్వాసితులకి సంఘీభావం తెలిపే మిషతో చాలా హడావుడి చేశాయి. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ఈ విషయంలో కొంచెం ఆలశ్యంగా మేల్కొన్నారు. తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవో:123ని హైకోర్టు పునరుద్దరించిన సంగతి పట్టించుకోకుండా నిర్వాసితుల కోసం ఆమరణ నిరాహార దీక్షా చేస్తానంటూ ఈరోజు అనుచరులని వెంటేసుకొని సంగారెడ్డి నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాలకి బయలుదేరారు. కానీ మధ్యలోనే పోలీసులు అడ్డుకొని అదుపులో తీసుకోవడంతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టక ముందే ముగిసిపోయింది. ఇప్పుడు తనని అడ్డుకొన్నా మళ్ళీ త్వరలోనే వచ్చి అక్కడే దీక్ష చేస్తానని జగ్గారెడ్డి శపథం చేసి వెళ్ళిపోయారు. ఒకవేళ అయన మళ్ళీ దీక్ష చేయడానికి బయలుదేరినా మళ్ళీ పోలీసులు నిర్బందించి వెనక్కి తిప్పి పంపుతారు. అసలు ఆయన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు, రైతు కూలీలకి న్యాయం చేయాలని నిరాహార దీక్ష చేయాలనుకొంటున్నారో లేకపోతే విభజన సమయంలో తన చేసిన రాజకీయ తప్పిదాలను సరిదిద్దుకొని, పార్టీలో తన ఉనికిని చాటుకొని తెలంగాణా ప్రజలని మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే దీక్షకి సిద్దం అయ్యారో ఖచ్చితంగా తెలియదు కానీ కాస్త ఆలస్యం చేయడం వలన ఫలం దక్కలేదు. తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవో:123 ప్రకారమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేయడానికి హైకోర్టు అనుమతించినప్పుడు, ఇంకా భూసేకరణ చట్టం-2013 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగ్గారెడ్డి దీక్ష చేయలనుకోవడం వలన ఏమి ప్రయోజనం ఉంటుందంటే, ఆయన చేసిన ఈ హడావుడి గురించి మీడియాలో వార్తలు వస్తాయి. అదే పదివేలు.
