చాలా కాలం గ్యాప్ తరవాత.. అఖిల్ సెట్లో అడుగుపెట్టాడు. స్టెప్పులతో సందడి చేశాడు. అయితే అది తన సినిమా కోసం కాదు. సుశాంత్ సినిమా కోసం. సుశాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆటాడుకొందాం రా. జి.నాగేశ్వరెడ్డి దర్శకుడు. ఈనెల 19న విడుదల అవుతోంది. ఈ చిత్రంలో నాగచైతన్య, అఖిల్ ఓ పాటలో కనిపించనున్నారు. చైతూ ఆల్రెడీ స్టెప్పులేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు అఖిల్ వంతు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ‘ఆటాడుకొందాం’ రా టైటిల్ సాంగ్ తెరకెక్కించారు. ఈ పాటలో సుశాంత్ తో కలసి అఖిల్ స్టెప్పులు వేశాడు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఓ బీజియం మొత్తం అఖిల్ కనిపిస్తాడట. మరో బీజియంలో నాగచైతన్య కనిపిస్తాడట. మొత్తానికి ఈ పాటతో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సుశాంత్ చాలాకాలం నుంచి ఓ నికార్సయిన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కథల ఎంపికలో ఎలాంటి లోపం లేనప్పటికీ.. ఏదో దురదృష్టం వెంటాడుతోంది. అయితే ఆటాడుకొందాం రా..తో సుశాంత్‌కి అదృష్టం తోడుగా వస్తుందేమో చూడాలి.
