చాలాకాలం తరవాత అలీ హీరోగా అవతారం ఎత్తుతున్నాడు. గతం కెలుక్కున్న గజినిలా నవ్వులు పంచబోతున్నాడు. అలీ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. టైటిల్ ఏంటో తెలుసా…?? ‘సంజయ్ రామస్వామి’. గజిని సినిమాలో సూర్య పేరు ఇదే. ఇప్పుడు అదే అలీ సినిమాకి టైటిల్ అయ్యిందన్నమాట. క్యాప్షన్ కూడా విచిత్రంగా ఉంది. ‘గతం కెలుక్కున్న గజిని’ అని పెట్టారు. నాగు గరవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శ్రీహరితో వీకెండ్ లవ్ చిత్రాన్ని తెరకెక్కించాడీ యువ దర్శకుడు. ఇప్పుడు అలీ కోసం ఈ సబ్జెట్ తయారు చేసుకొన్నాడట. సినిమా మొత్తం సరదా సరదాగా సాగిపోతుందని, అలీ పాత్ర నవ్వులు పంచుతుందని దర్శకుడు చెబుతున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారట. గజినీ సినిమాకీ, ఈ సంజయ్ రామస్వామికీ ఉన్న లింకేంటన్నది.. తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. అలీ.. హీరో అవతారం ఎత్తి చాలాకాలం అయ్యింది. ఈ వెటరన్ కమెడియన్ ఇప్పుడు హీరో అంటే జనం ఒప్పుకొంటారా అనేదే అసలు సిసలు డౌటు. కథలో బలం ఉంటే.. హీరో ఎవరైనా చూస్తారు లెండి. మరి ఈ గజినిలో బలం ఉందా, లేదా అనేది తేలాలంటే కొంతకాలం ఆగాలి.
