కృష్ణా పుష్కరాల కోసం తెదేపా ప్రత్యేకంగా రూపొందించిన ‘కృష్ణా యాప్’ ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకి ఏ బాధ్యత అప్పగించినా పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వంతో రాజీపడబోమని చెప్పారు. దానిపై తల్లిపిల్లా కాంగ్రెస్ పార్టీలే ప్రజలని మభ్యపెడుతున్నాయని అన్నారు.
త్వరలో రాబోయే దసరా పండుగ రోజున మంత్రివర్గ విస్తరణ చేసి నారా లోకేష్ ని మంత్రి పదవి అప్పగిస్తారని ఆమధ్య చాలా ప్రచారం చాలా జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెదేపా అధ్యక్షుడుగ నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది. సాధారణంగా ఏదో పదవి ఆశిస్తున్న లేదా పొందబోతున్న నేతలు “పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తాను,”అనే స్టాండర్డ్ డైలాగ్ చెపుతుంటారు. కనుక నారా లోకేష్ కూడా అదే సూచిస్తున్నారేమో? ఆయన కోరుకొంటే మంత్రి పదవి లేదా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం పెద్ద విశేషం కాదు. అసలు ఇప్పటికే రెండేళ్ళు ఆలస్యం అయ్యింది. కనుక త్వరలోనే ఈ రెంటిలో ఏదో ఒక పదవి ఆయనకి దక్కే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
కేంద్రప్రభుత్వం ఇంతవరకు ప్రత్యేక హోదా ఇవ్వలేమనే చెపుతూ వచ్చింది. కానీ దాని కోసం తెదేపా ఒత్తిడి పెంచడంతో త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పింది. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. కనుక ఏపికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం లోకేష్ మాటలలో కనబడింది. ఒకవేళ కేంద్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేనట్లయితే లోకేష్ ఆవిధంగా చెప్పి ఉండరు. కనుక త్వరలోనే ప్రత్యేక హోదాపై ప్రకటన వెలువడుతుందనే ఆశిద్దాము.
