దళితులపై విపరీతమైన ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడటం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అలవాటు. కాంగ్రెస్ లో చాలా మంది తమకు దళిత ఓటు బ్యాంకుమీద పేటెంట్ ఉందన్నట్టు మాట్లాడుతుంటారు. నిజానికి వాళ్లకు దళితుల మీద కాదు, వాళ్ల ఓట్ల మీదే ప్రేమ అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఆ విమర్శ నిజమేనని గురువారం పార్లమెంట్ సాక్షిగా మరోసారి రుజువైంది.
దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై గురువారం లోక్ సభలో ఐదు గంటలకు పైగా చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యులు చర్చలోపాల్గొన్నారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జవాబిచ్చారు. అయితే, ఇంత ముఖ్యమైన చర్చ జరుగుతున్నా రాహుల్ గాంధీ సభలో పత్తాలేరు. కాంగ్రెస్ వారికి సంబంధించిన ముందు వరుస సీట్లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. గత నెలలో దళితుల అంశంపై లోక్ సభలో చర్చ జరుగుతుందగా రాహుల్ నిద్రపోయారనేది వివాదానికి దారితీసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోగానే రాహుల్ ఆగమేఘాల మీద వాలిపోయారు. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. మోడీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఇటీవల గుజరాత్ లోని ఉనా పట్టణంలో గోరక్షణ పేరుతో దళితులను చితక బాదిన ఘటనపైనా రాహుల్ ఎంతోసానుభూతి ప్రకటించారు. అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. పనిలో పనిగా మోడీని, బీజేపీని ఘాటుగా విమర్శించారు.
దళితుల విషయంలో రాహుల్, కాంగ్రెస్ పార్టీల ద్వంద్వ వైఖరి బయటపడటం ఇదే మొదటిసారి కాదు. హర్యానాలో ఇటీవల ఓ దళిత మహిళ అత్యాచారానికి గురైంది. అగ్రవర్ణానికి చెందిన కొందరు ఆమెపై రెండేళ్ల క్రితం అత్యాచారం చేశారు. కేసు వాపస్ తీసుకోవాలంటూ ఇటీవల మళ్లీ వాళ్లే అత్యాచారం చేశారు. అయినా రాహుల్ గాంధీ ఆ ఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఢిల్లీకి సమీపంలోనే ఉన్నా ఆ హర్యానా పట్టణానికి వెళ్లలేదు. అలాగే కేరళ, యూపీ, తదితర ప్రాంతాల్లో దళితులపై దాడులు జరిగినా కిమ్మన లేదు. కేరళలోకాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలపై నోరుమెదపలేదు. సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్న యూపీలో పలు దారుణ ఘటనలు జరిగినా ప్రత్యేక విమానంలో వెళ్లి పరామర్శించలేదు.
లోక్ సభలో గురువారం దళితులపై చర్చ హటాత్తుగా జరిగింది కూడా కాదు. దీనికోసం కాంగ్రెస్ పార్టీయే డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఒప్పుకుంది. అయినా యువనేత డుమ్మాకొట్టారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలిని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. మొసలికన్నీరు కార్చడం తప్ప, ఆయనకు దళితుల విషయంలోచిత్త శుద్ధి లేదని మీనాక్షి లేఖి, ఇతర బీజేపీ ఎంపీలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మాటల్లో ఆత్మీయత, చేతల్లో నిర్లక్ష్యమే రాహుల్ నిజస్వరూపమని వ్యాఖ్యానిస్తున్నారు.
