గ్యాంగ్ స్టార్ నయీంతో తెలంగాణాలో తెదేపా నేతలకి సంబంధాలున్నయనే వార్త అప్పుడే అక్కడ చాలా సంచలనం సృష్టిస్తోంది. తెరాస, తెదేపా నేతల మధ్య అప్పుడే దానిపై మాటల యుద్ధం మొదలైపోయింది. ఒకరోజు ఆలస్యంగానైనా వైకాపా కూడా ఆ పాయింట్ ని క్యాచ్ చేసింది. దానితో తెదేపాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకోవచ్చని గ్రహించడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెదేపాపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది.
ఆ పార్టీ అధికార ప్రతినిధి పార్ధసారధి మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడే నయీంని పెంచి పోషించారని, తెదేపా నేతలకి నయీంతో సంబంధాలున్నాయని తెరాస నేతలు చెపుతున్నారు. కనుక దీనిపై లోతుగా విచారణ జరిపించి నిజానిజాలు బయట పెట్టాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి, తెదేపా నేతలకి నయీంతో సంబంధాలున్నట్లయితే వారు కూడా నేరస్తులే అవుతారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా రౌడీలని పెంచిపోషిస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న భూ దంధాలపై చాలా అనుమానాలున్నాయి. అప్పుడు ఓటుకి నోటు కేసు నుంచి ఎలాగో బయటపడ్డారు. ఇప్పుడు దీని నుంచి ఏవిధంగా బయటపడతారో చూడాలి,” అని పార్ధసారధి అన్నారు.
తెదేపాని, చంద్రబాబు నాయుడుని నిలదీయడానికి వచ్చిన అవకాశాలని జారవిడుచుకోవడానికి వైకాపా ఇష్టపడదని పార్ధసారధి మాటలు రుజువు చేస్తున్నాయి. కానీ ఆ ఆత్రంతో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా కొందరు కాంగ్రెస్ నేతలు నయీం సేవలని ఉపయోగించుకొన్నారనే వార్తలని మరిచిపోతోంది. కనుక అద్దాలమేడలో కూర్చొని రోడ్డు మీదపోయే వారి మీద రాళ్ళేసే ముందు కొంచెం ఆలోచించుకొంటే మంచిదేమో?
