కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాక్సైట్ త్రవ్వకాలని వ్యతిరేకిస్తూ ఈనెల 17వ తేదీన విశాఖ ఏజన్సీ ఏరియాలో పాదయాత్ర చేయడానికి వస్తున్నారని తాజా సమాచారం. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాక్సైట్ త్రవ్వకాలకి వ్యతిరేకంగా పోరాడిన తరువాత తెదేపా ప్రభుత్వం దానికోసం జారీ చేసిన జీవోని నిలిపివేసింది కానీ రద్దు చేయలేదు. కానీ అప్పటి నుంచి అక్కడ బాక్సైట్ త్రవ్వకాలకి ఎవరినీ అనుమతించలేదు కూడా. ఒకవేళ గుట్టుగా బాక్సైట్ త్రవ్వకాలు జరుగుతున్నట్లయితే వైకాపా చూస్తూ మౌనంగా ఊరుకోదు కూడా. కనుక లేని సమస్య కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం దేనికో…దాని వలన కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమిటో అర్ధం కాదు.
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో మోడీ ప్రభుత్వంతో చాలా గట్టిగా పోరాడింది. ఆ కారణంగా రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక సెగలు రగులుతున్నాయి. ఆ సంగతి రాహుల్ గాంధీకి తెలియదనుకోలేము. కనుక ఆయన దాని కోసం వచ్చి రాష్ట్రంలో ఎక్కడైనా ఓ బహిరంగ సభో లేదా పాదయాత్రో చేసుకొంటే ఆయనకీ, పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉండేది. కానీ బాక్సైట్ త్రవ్వకాలే జరగనప్పుడు దానికి నిరసన తెలపడం కోసం కాళ్ళీడ్చుకొంటూ ఆ కొండల్లో గుట్టలో పాదయాత్రలు చేయడం ఎందుకో? దాని వలన కాళ్ళు నొప్పులు తప్ప వేరే ఏముంటుంది?
విశేషం ఏమిటంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బాక్సైట్ త్రావ్వకాలకి ప్రభుత్వం అనుమతించినప్పుడు, చంద్రబాబు నాయుడుతో సహా ప్రతిపక్షాలు దానిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒకప్పుడు బాక్సైట్ త్రవ్వకాలని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాక్సైట్ త్రావ్వకాలకి అనుమతిస్తుంటే జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇప్పుడు అభ్యంతరం చెపుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనుమతించినవారే ప్రతిపక్షంలోకి మారినప్పుడు వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి రాగానే అనుమతిస్తుండటం విచిత్రం.
అదొక బంగారు గని అని అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడో గుర్తించాయి. తమకి అవకాశం దక్కినప్పుడు దానిని త్రవ్వేసుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. అప్పుడు ప్రతిపక్షాలు ‘గిరిజనుల భవిష్యత్’ అంటూ మొసలి కన్నీళ్లు కార్చుతూ అధికార పార్టీకి అడ్డు పడుతుంటాయి. అంటే రాజకీయ పార్టీలకి ఏదో విధంగా ఆ గనులని తవ్వేసుకొందామనే యావ తప్ప అక్కడి గిరిజనులపై ఎటువంటి ప్రేమలేదని అర్ధం అవుతోంది. రాజకీయ పార్టీలకి గిరిజనులు ఒక పావు వంటివారు మాత్రమే. అవసరమైనప్పుడు వారిని వాడుకొని ఆ తరువాత పక్కన పడేస్తుంటాయి. అంతే! గిరిజనుల అదృష్టం ఏమిటంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నడూ చేతులు కలుపవు. కలిపితే అందరూ కలిసి వారిని పక్కకి తప్పించేసి బాక్సైట్ అంతా తవ్వేసుకొని ఉండేవారే.
