గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. అతడి భార్యను, కొందరు అనుచరులను అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం జరిగిపోయాయి. ఇద్దరు ప్రధాన అనుచరులు ప్రస్తుతం జ్యుడీసియల్ రిమాండ్ లోఉన్నారు. కొందరు రాజకీయ నాయకులనూ అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కొందరు జర్నలిస్టులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారట. అంతా బాగానే ఉంది. కానీ నయీంకు అడుగడుగునా సహకరించి దందాలు చేయించిన బడా పోలీస్ అధికారుల మాటేంటి?
ఒకప్పుడు నయీం అంటే, పోలీసులకు లొంగిపోయిన మాజీ నక్సలైట్ మాత్రమే. అతడిని ఓ మాఫియా డాన్ గా మార్చింది ఆనాటి పోలీస్ బాస్ అని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా రాజకీయ పోలీస్, మీడియా తదితర రంగాల వారు చాలా మంది నయీంకు సహకరించి భారీగా సంపాదించారట.
ప్రస్తుతం పెద్ద స్థాయిలో ఉన్న వారితో పాటు చిన్న స్థాయి పోలీసుల వరకూ చాలా మందికి నయీంతో లింకులున్నట్టు వార్తలు వస్తున్నాయి. నయీం బంధువులు కూడా పోలీసులపైనే దుమ్మెత్తిపోస్తున్నారు.మరి ఈ మాఫియాకు సహకరించిన పోలీసుల గురించి ఇంత వరకూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏమీ మాట్లాడలేదు. నరహంకుడికి, కబ్జాదారుడికి సహకరించి వేల మందికి మనశ్శాంతి లేకుండా చేయడానికి సహకరించిన పోలీసులను అరెస్టు చేస్తారా లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు. చివరకు మనం మనం బరంపురం అనే తరహాలో పోలీసులపై కేసుల్లేకుండా మేనేజ్ చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల సంగతి ఏమో గానీ రాజకీయంగా మాత్రం ప్రకంపనలు మొదలయ్యాయి. టీడీపీ మాజీ మంత్రి ఉమామాధవరెడ్డికి సంబంధించి ఎవరో లీకులు ఇవ్వడంతో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పేరు రాయకపోయినా ఆమే అని తెలిసేలా కథనాలు వచ్చాయి. దీంతో ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. తనకు నయీం దందాలతోసంబంధం లేదన్నారు. జ్యుడీషియరీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు సరే, నేరస్తుడిని పట్టుకోవాల్సిన పోలీసులే దోస్గీ చేసి నేరాలు చేయించడం మరీ దారుణం. మరి ఆ పోలీసులకు శిక్ష పడుతుందని భావించ వచ్చా? పోలీసు బాస్ లే జవాబు చెప్పాలి.
