చాలాకాలం తరవాత రుద్రమదేవి మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రం ఆస్కార్ స్ర్కీనింగ్ కమిటీ ముందుకు వెళ్లిందట. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతీ యేటా ఆస్కార్‌కు భారతదేశం తరపున ఓ చిత్రాన్ని అఫీషియల్ ఎంట్రీగా పంపుతుంది. అందులో భాగంగా తెలుగు నుంచి రుద్రమదేవి చిత్రాన్ని ఎంపిక చేశారని గుణశేఖర్ తన ఫేస్ బుక్ ద్వారా ధృవీకరించారు. అంతా బాగానే ఉంది. నిజానికి ఈ సినిమాకి అంత స్థాయి ఉందా? అనేదే అసలు ప్రశ్న. రుద్రమదేవి కథని భారీ స్థాయిలో తెరకెక్కించాలన్న గుణశేఖర్ కలని ఎవ్వరూ తప్పుపట్టలేరు. అయితే.. ఆ విధానం మాత్రం సంతృప్తికరంగా లేదు. ఈ సినిమా కోసం గుణ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది? అనేది పక్కన పెడితే.. చరిత్రని కమర్షియల్ కథగా మార్చడానికి ఆయన చేయాల్సిన పనులన్నీ చేశారు.
గ్రాఫిక్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. ఏదో యానిమేషన్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. విడుదలకు ముందు నానా హంగామా చేసిన గుణ.. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఎవ్వరికీ కనిపించలేదు. అసలు ఆ సినిమా ప్రస్తావనే తీసుకురాలేదు. ఇప్పుడు ఆస్కార్ స్ర్కీనింగ్ కమిటీ ముందుకు వెళ్లగానే.. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేశారు. గతేడాది ఆస్కార్ స్ర్కీనింగ్కమిటీ ముందుకు బాహుబలి సినిమా వెళ్లింది. అయితే.. అఫీషియల్ ఎంట్రీగా నిలవలేకపోయింది. బాహుబలి ఫెయిల్ అయిన చోట.. రుద్రమదేవి రాణిస్తుందా, ఈ సినిమాకి అంత సీన్ ఉందా? అనేది కాలమే చెప్పాలి.
