హైకోర్టు ఆదేశానుసారం తెలంగాణా ప్రభుత్వం ఇదివరకు తను జారీ చేసిన జీవో:123కి సవరణలు చేస్తూ నిన్న మరో కొత్త జీవో జారీ చేసింది. కానీ దానిపై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో కొనసాగుతున్న ఈ న్యాయపోరాటాల కారణంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ కార్యక్రమంలో ఆలస్యం జరుగుతున్నందున అంతవరకు ఉపాధి కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలకి నెలకి రూ.2500 పరిహారం చెల్లించమన్న తన ఆదేశాలని తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోనందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే కొత్తగా జారీ చేసిన జీవోలో కొని సాంకేతిక లోపాలని ఎత్తిచూపించి వాటన్నిటినీ సవరించి తీసుకురావాలని ఆదేశిస్తూ ఈ కేసుని ఆగస్ట్ 23కి వాయిదా వేసింది.
తెలంగాణా ప్రభుత్వం నిన్న జారీ చేసిన జీవోలో రైతులకి, రైతు కూలీలు, చేతిపనులు చేసుకొనేవారు ఇతర నిర్వాసితులకి చక్కటి ప్యాకేజ్ పొందుపరిచింది. దానిలో నిర్వాసిత కుటుంబాలలో ఒకొక్కరికి ప్రాజెక్టులోనే ఉద్యోగం, జీవనోపాధి భ్రుతి, నిర్వాసిత కుటుంబాలు తరలింపు రవాణా గ్రాంట్, ఉద్యోగం వద్దనుకొనేవారికి నెలనెలా 2500-3000 చొప్పున 20 ఏళ్ల పాటు నిరుద్యోగ భ్రుతి చెల్లింపు, అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఒంటరిగా ఉంటున్నవారికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు, ఉద్యోగం వద్దనుకొంటే వన్-టైం సెటిల్మెంటు క్రింద ఒకేసారి రూ.7.5 లక్షలు డబ్బు చెల్లిస్తామని పేర్కొంది. నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లింపు విషయంలో తెలంగాణా ప్రభుత్వం ఉదారంగానే మానవీయదృక్పధంతోనే ఈ నష్టపరిహారం రూపొందించినట్లు అర్ధం అవుతోంది. కానీ దానిలో కొన్ని సాంకేతిక అంశాలలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ లోపాలని సవరిస్తే బహుశః హైకోర్టు జీవో అమలుకి అంగీకారం తెలపవచ్చు.
