కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం గత రెండేళ్ళుగా ఏదో ఒక హడావుడి చేస్తూనే ఉంది. కానీ దాని హడావుడి దేనికో అందరికీ తెలుసు. గత ఏడాది తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించినప్పుడు అదే పట్టణానికి చెందిన మునికోటి అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రత్యేక హోదా కోసం బలిదానం చేసుకొన్న సంగతి కాంగ్రెస్, వైకాపా నేతలు మరిచిపోయుండవచ్చు. ఈ రాజకీయాలకి, ప్రత్యేక హోదా పోరాటాలకి దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ మాత్రం మరిచిపోలేదు. మునికోటి మరణించిన తరువాత అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నట్లు తెలుసుకొని తన సన్నిహితుడు మారిశెట్టి రాఘవయ్య ద్వారా మునికోటి భార్య దాక్షాయణికి రూ.5 లక్షలు ఆర్ధిక సహాయం అందజేశారు.
ప్రత్యేక హోదా, రైల్వేజోన్ లేదా మరొకటి ఏదైనా కావచ్చు దాని కోసం రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఆవేశపడి ప్రాణాలు తీసుకొంటే నష్టపోయేది వారి కుటుంబ సభ్యులే తప్ప రాజకీయ నాయకులు కారు. ఆ తరువాత వారి కుటుంబాలని పలుకరించేవారు కూడా ఉండరు. మునికోటి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఆదుకోవడం ఆయన గొప్పదనం, వారి అదృష్టమే. కానీ అటువంటి అదృష్టం కూడా అందరికీ దక్కదు కనుక ఇకపై ఎవరూ కూడా అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేయడం మంచిది కాదు.
ప్రత్యేక హోదా గురించి రాష్ట్రంలో ఇంత గొడవ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ప్రధాని నరేంద్ర మోడీని నిలదీసి ప్రశ్నించడంలేదని చాలా మంది రాజకీయ నాయకులు, మీడియా కూడా విమర్శిస్తుండటం చూస్తూనే ఉన్నాము. నిజమే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదు. కానీ ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో మునికోటి వంటి సామాన్యులు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలని ఆదుకోవలసిన రాజకీయ పార్టీలు పట్టించుకోకపోతే వారి తప్పిదాలకి పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లిస్తున్నారు.
