అ.ఆ తరవాత మరో సినిమా పట్టాలెక్కించడానికి చాలా సమయం తీసుకొంటున్నాడు నితిన్. ఈలోగా చాలా కథలు విన్నాడు. అయితే ఏవీ ఓ పట్టాన నచ్చలేదు. కొన్ని కథల్ని ఓకే చేశాడు గానీ, అవి ప్రస్తుతం స్ర్కిప్టు దశలోనే ఉన్నాయి. అయితే నితిన్ ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని మొదలెట్టే సన్నాహాలు మొదలెట్టినట్టు టాక్. అయితే ఆ సినిమా బాధ్యత హను రాఘవపూడికి అప్పగించినట్టు తెలుస్తోంది. అందాల రాక్షసి సినిమాతో ఆకట్టుకొన్నాడు హను. ఆ తరవాత కృష్ణగాడి వీర ప్రేమగాథతో హిట్టుకొట్టాడు. అఖిల్‌తో హను ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. ఎందుకనో ఆ ప్రాజెక్టు కూడా ముందుకు కదలడం లేదు. ఇప్పుడు ఆ కథ నితిన్ దగ్గరకు వచ్చినట్టు టాక్. హను చెప్పిన కథ నితిన్‌కి నచ్చడంతో.. వెంటనే పట్టాలెక్కించాలని నితిన్ డిసైడ్ అయ్యాడట. మరోవైపు ఈ కథ విషయంలో అఖిల్‌కీ, నాగ్ కీ కొన్ని అనుమానాలు ఉండడంతో…. రిస్క్ ఎందుకు? అని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ కాంపౌండ్ చుట్టూ తిరిగిన హను.. ఇప్పుడు ఆ కథనే నితిన్‌కి వినిపించి ఓకే చేయించుకొన్నాడట. సెప్టెంబరులో ఈ చిత్రం పట్టాలెక్కనున్నదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు నితిన్ కోసం సంపత్‌నంది, కృష్ణ చైతన్య, విజయ్ కుమార్ కొండా కథలు రెడీ చేసుకొంటున్నారు. హను సినిమా పూర్తయ్యాకే వాళ్లకు అవకాశాలిస్తాడట.
