వారాహి పై తొలి విడత విజయాత్రను పవన్ కల్యాణ్ ఓ రేంజ్ లో పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల కోసం మొదటి యాత్రను వ్యూహాత్మకంగా పూర్తిచేశారు. పవన్ కల్యాణ్ ఎక్కడ ఎప్పుడు వెళ్లినా జన స్పందనకు మాత్రం కొదవ ఉండదు. ఆయన పవర్ స్టార్. ప్రత్యేకంగా జన సమీకరణ చేయాల్సిన అవసరం జనసేన నేతలకు ఉండదు. అందుకే అన్నవరం నుంచి ప్రారంభించి భీమవరం వరకూ జన జాతర కనిపించింది. అన్ని చోట్లా ప్రత్యేకంగా కొన్ని వర్గాలతో సమావేశం అయ్యారు. వారి సమస్యలు విన్నారు. అన్నీ నోట్ చేసుకున్నారు.
అన్యాయానికి గురైన వాడు ఊగిపోతూనే మాట్లాడతాడని భీమవరంలో పవన్ కల్యాణ్ సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చారు. పవన్ ప్రసంగాలు గతంలో కన్నా చాలా షార్ప్ గా ఉన్నాయి. నేరుగా వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వారి తీరును ప్రజల ముందు పెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు పవన్ కల్యాణ్ ను కంట్రోల్ చేయడానికి ఎక్కువగా వ్యక్తిగత విమర్శలను నమ్ముకుంటారు. అయితే పవన్ వారిని ఏ మాత్రం లెక్క చేయకుండా వారి భాషలోనే కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ “నా కొడకల్లారా ” అన్నాడని ఆయన రాజకీయాలకు పనికి రాడని అంబటి రాంబాబు ఆవేశపడిపోయారు. మరి వారన్న మాటలకు ?
పవన్ కల్యాణ్ ఓ స్ట్రాటజీ ప్రకారమే వారాహియాత్ర సాగేలా చూసుకున్నారు. ప్రధానంగా తనకు మద్దతుగా ఉంటుందనుకున్న కాపు సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన విస్తృతంగా శ్రమించారు. వ్యూహాత్మకంగా ప్రసంగాలు చేశారు. అందుకే ఆయనపై వైఎస్ఆర్సీపీ కాపు నేతలు విరుచుకుపడ్డారు. ముద్రగడ వంటి వారు కూడా తెరపైకి వచ్చారు. చివరికీ సీఎం జగన్ బడి పిల్లల మీటింగ్ లో కూడా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ స్పందన చూస్తే ఖచ్చితంగా వారాహి యాత్ర అనుకున్నదాని కంటే ఎక్కువ సక్సెస్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
