అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడంలో వైసీపీని మించిన స్ట్రాటజిక్ పార్టీ ఉండదు. అది కేంద్రంలో ఉన్న పార్టీని అయినా రాష్ట్రంలో ఉన్న పార్టీని అయినా ఆఖరికి సొంత ఎమ్మెల్సీలను అయినా అంతే. సొంత ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి చాలా కాలం అయినా అదే పార్టీకి చెందిన మండలి చైర్మన్ మాత్రం ఆమోదించడం లేదు. చివరికి ఆ ఎమ్మెల్సీలు మండలిలో అడగినా… చివరికి కోర్టుకు వెళ్లినా నిర్ణయం తీసుకోవడం లేదు.
ఎన్నికలకు ముందు వివరణ తీసుకోకుండానే అర్థరాత్రి అనర్హతా వేటు
ఎన్నికలకు ముందు పార్టీ మారుతున్నారని తెలిస్తే అనర్హత వేటు వేశారు. వివరణ కూడా తీసుకోకుండా… శాసనమండలి చైర్మన్ పేరుతో అనర్హతా వేటు వేస్తూ అర్థరాత్రి ఉత్తర్వులు వచ్చేవి. ఎన్నికలు అయిపోయాక.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేస్తే.. అదే శాసన మండలి చైర్మన్ ఆమోదించడం లేదు. వారు మా రాజీనామాలు ఆమోదించండి మహా ప్రభో అని బతిమాలుకుంటున్నారు. కానీ పరిశీలిస్తున్నామంటున్నారు. వైసీపీ అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే ఘోర మనస్థత్వానికి ఇంత కంటే సాక్ష్యం ఏముంటుంది?
రాజీనామాల ఆమోదం కోసం చూస్తున్న ఐదుగురు ఎమ్మెల్సీలు
వైసీపీకి ఐదుగురు ఎమ్మెల్సీలు మీ పార్టీకో దండం అని చెప్పేశారు. వారు తమ రాజీనామా లు చేసి నెలలు అవుతుంది. ఇప్పటి వరకూ ఆమోదించలేదు. వారు శాసనమండలికి వచ్చి మా ఎమ్మెల్సీ రాజీనామాలు ఆమోదించండి అని నేరుగా చైర్మన్ నే అడుగుతున్నారు. కానీ ఆయన మాత్రం నేరుగా సమాధానం చెప్పడం లేదు. వైసీపీకి చెందిన చైర్మన్ కావడంతో ఆయన హైకమాండ్ ఆదేశాల కోసం చూస్తున్నారేమో కానీ వైసీపీ చెప్పిన విలువలకు ఇది పూర్తి తేడాగా ఉందని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు తమ రాజీనామాలు ఆమోదించాలని జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ.. మండలి చైర్మన్ కదలడం లేదు.
రాజీనామాలు ఆమోదిస్తే మరో ఎనిమిది మంది రెడీ
ఎమ్మెల్సీలు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. ఆ పార్టీ కార్యకలాపాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. పాల్గొనే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ఆ పార్టీ నేతలను ఇంకా అంటి పెట్టుకుని ఉంచుకోవడం ఎందుకు?. ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయనకు ప్రోటోకాల్ ఉంది. జగన్ కు లేని ప్రోటోకాల్ ఉంది.కానీ అక్కడ కూడా ప్రతిపక్ష నేత హోదా పోతుందేమోనని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో వైసీపీ తరపున ఒక్క ఎమ్మెల్సీ కూడా ఉండే అవకాశం లేదు. బొత్స కూడా వంశీకృష్ణ రాజీనామా చేసిన స్థానంలో మిగిలిన కాలానికే ఎన్నికయ్యారు.
అందరితో ఇదే స్ట్రాటజీనా?
అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరిపడి.. అధికారం పోయాక.. వాళ్లూ.. వీళ్లు అనే తేడా లేకుండా కాళ్లు పట్టుకోవడం ఎందుకన్న ప్రశ్న క్యాడర్ నుంచి వస్తోంది. బీజేపీ కాళ్లు ఇప్పటికి వదలడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని టీడీపీ కాళ్లూ పట్టేసుకుంటున్నారు. ఛీ కొడుతున్నా ఎమ్మెల్సీ రాజీనామాలు ఆమోదించడం లేదు. ఇలాంటి రాజకీయాలు చేస్తే.. ఏమి..చేయకపోతే ఏమి..?
