జగన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు. అక్కడ డిజిటల్ బుక్ ను ప్రారంభించారు. ఆ బుక్‌లో తమకు ఏం అన్యాయం జరిగిందో వైసీపీ కార్యకర్తలు రాసుకోవచ్చు. అంటే ఎవరి కష్టాలు ఎవరూ వినరు. వారికి వారు నమోదు చేసుకోవాలి. అధికారంలోకి వచ్చాక ఆ కష్టాలు, కన్నీరు జగన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించి తుడుస్తారట. అప్పటికి గుర్తుంటుందా .. లేదా అన్నది మాత్రం ఆలోచించకూడదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వారిని నమ్మించి రోడ్ల మీదకు తీసుకురావడం ముఖ్యం.
కార్యకర్తలు ఇప్పుడు డిజిటల్ బుక్ అడగడం లేదు. ఎందుకంటే ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టడం లేదు. ఇప్పుడు కార్యకర్తలు కోరుతోంది వేల్ఫేర్ ఫండ్. పార్టీ కోసం పదేళ్లు కష్టపడి పని చేస్తే.. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు వాలంటీర్లను నెత్తిన పెట్టుకున్న జగన్ రెడ్డి క్యాడర్ ను గాలికొదిలేశారు. వాలంటీర్లను నాయకుల్ని చేస్తానన్నారు కానీ.. పదేళ్లు తన కోసం పని చేసిన కార్యకర్తల సంక్షేమం పట్టించుకోలేదు. చివరికి ఎన్నికలకు ముందు కూడా గెలుస్తామని చెప్పి పార్టీ నేతల్ని బెట్టింగులకు ప్రోత్సహించి నిండా ముంచారు.
పార్టీ క్యాడర్ అంతా ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడు వారు అనారోగ్యం పాలవుతున్నా.. పట్టించుకునేవాళ్లు లేరు. ఇప్పటికీ కార్యకర్తలు పార్టీ నుంచి కనీస ఆదరవు లేక ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా టీముల్లో చిచ్చు కూడా వచ్చేసింది. హార్డ్ కోర్గా పని చేసిన వారూ లోకేష్‌ను సాయం అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా .. కార్యకర్తల కోసం ఓ వేల్ఫేర్ ఫండ్ పెట్టాలి. పార్టీ ఖాతాలో ఎన్నికలకు ముందు వెయ్యికోట్లకుపైగానే నిధులు ఉండాలి. వాటితో కార్యకర్తలకు సాయం చేయడం పెద్ద విషయం కాదు. మరి ఎందుకు ఒక్క రూపాయి కూడా సాయం చేయడం లేదో వారికే తెలియాలి. డిజిటల్ బుక్ పేరుతో మాయ చేయడం కన్ా.. ముందు సాయం చేయమని కార్యకర్తలు కోరుతున్నారు.
