వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీకి, ఎమ్మెల్సీ స్థానాలకు వారు చాలా రోజుల క్రితమే రాజీనామాలు సమర్పించారు. కానీ మండలి చైర్మన్ ఇంకా వీరి రాజీనామాలను ఆమోదించలేదు. పోతుల సునీత , కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ, మండలి వైస్ చైర్మన్ జకియా ఖానం కూడా రాజీనామాలు చేశారు. వీరిలో జయమంగళ తన రాజీనామాను ఆమోదించడం లేదని కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు ఆలస్యం చేస్తున్నారని మండలి చైర్మన్ కు రూ. పదివేల ఫైన్ కూడా వేసింది. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
మర్రి రాజశేఖర్ కుటంబం సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉంది. ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. జగన్ వారిని నట్టేట ముంచడంతో పాటు తీవ్ర అవమానాలకు గురి చేయడం, విడదల రజనీ కోసం బలి చేయడంతో ఆయన బయటకు వచ్చారు. చాలా కాలం టీడీపీలో ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు బల్లి కల్యాణచక్రవర్తి మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. కర్రి పద్మశ్రీ కూడా వైసీపీలో ఉండలేకపోయారు. పోతుల సునీత ఇటీవల బీజేపీలో చేరారు. జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదించిన తర్వాత జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది.
రాజీనామాలు ఆమోదించాలని కోర్టుకు వెళ్లినా మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడం లేదు. ఆయన వైసీపీ నేత. జగన్ రెడ్డి చెప్పినట్లుగా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులపై విచారణ జరపకుండా రాత్రికి రాత్రే కొంత మంది ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు కూడా వేశారు. ఇప్పుడు .. రాజీనామాలు చేసినా ఆమోదించడం లేదు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శలు వస్తున్నా.. వైసీపీ తగ్గడం లేదు.
