వైసీపీ ఎమ్మెల్యేలలో కొంత మందిపై అనర్హతా వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఇప్పటికే ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు దొంగ చాటుగా అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్ లో సంతకాలు చేసి.. సభకు రాకుండా వెళ్లిపోతున్నారు. ఇలా దొంగ సంతకాలు పెట్టి జీతభత్యాలు తీసుకుంటున్నారు. అలాంటి వారిపై ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశమయింది.
అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసి సమావేశంలో పాల్గొనకుండా జీతభత్యాలు తీసుకోవడం పై సభ్యులు చర్చించారు. సభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపైనా చర్చించారు. సభా నియమాల ప్రకారం ఈ రెండు అంశాలు ఆమోదయోగ్యమైనవి కాదని అభిప్రాయానికి వచ్చారు. వచ్చే సమావేశంలో నాటికి ఎమ్మెల్యేల హాజరు పట్టిని తమ ముందు ఉంచాలని శాసనసభ సెక్రటరీని కమిటీ ఆదేశించింది. సభకు హాజరు కాలేదన్న కారణంగా అనర్హతా వేటు వేయడం ఓ ఆప్షన్ అయితే..దొంగ సంతకాలు పెట్టిన వారిపై నేరుగా అనర్హతా వేయడం మరో ఆప్షన్.
అనర్హతా వేటు వేయాలంటే.. ముందుగా వారు చేస్తున్నది తప్పు.. వారికి ఆ శిక్ష కరెక్టే అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. అందుకే ముందుగా సభకు రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. వారు రహస్యంగా వచ్చి సంతకాలు చేయడం.. సభకు రాకపోయినా వచ్చినట్లుగా ప్రజాధనాన్ని జీతభత్యాలుగా తీసుకోవడం వంటి వాటిని ప్రజల ముందు పెట్టి చర్చ పెట్టనున్నారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి .. నివేదిక తెప్పించుకుని.. ప్రజలకు వారు చేసిన తప్పులపై విస్తృత ప్రచారం చేసి.. ఎథిక్స్ కమిటీ నివేదిక ప్రకారం అనర్హతా వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు ఇలా చేశారని అనుమానిస్తున్నారు.
