వైసీపీ అగ్రనాయకత్వం ఆఫ్ లైన్ రాజకీయం దండగని అనుకుంటోంది. ఆన్ లైన్లో పోస్టులు పెట్టుకుంటే చాలని అనుకుంటోంది. నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ కు టార్గెట్ పెట్టారు. ఎనిమిది వేల మంది కార్యకర్తలను గుర్తించి వారిని సోషల్ మీడియా కార్యకర్తలుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని .. వారితో ఆర్గనైజ్డ్ గా పోస్టులు పెట్టించాలని ఆదేశాలు. ఇంచార్జులతో ఈ పనులు చేయించే బాధ్యతను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్నారు.
అవసరం అయితే పెయిడ్ టీముల్ని పెట్టుకోవాలని పలువురు నేతలపై సజ్జల ఒత్తిడి తెస్తున్నట్లుగా వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా టీమ్ ఉంటుందని.. ఆ టీమ్ సహకరిస్తుందని.. నియోజకవర్గాల్లోనూ టీములు పెట్టుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలంటే ఈ సోషల్ మీడియా టీం ఎంత బలంగా ఉందో కూడా చూస్తామని సజ్జల పోటీ పెడుతున్నట్లుగా చెబుతున్నారు. టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న కొంత మంది.. టీముల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఎనిమిది వేల మంది అంటే కష్టమని ఎక్కువ మంది భావిస్తున్నారు.
సోషల్ మీడియాలోనే ప్రశ్నించాలని జగన్ క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. కానీ ప్రశ్నించడం అంటే బూతులని ఆ పార్టీ క్యాడర్ అనుకుంటున్నారు. అందుకే కేసుల పాలై జైలుకు పోతున్నారు. పార్టీ ఆఫీసు నుంచి వచ్చే మార్ఫింగ్లను కూడా పోస్టు చేసి కేసుల పాలవుతున్నారు. ఇలాంటి వారికి న్యాయసాయం అందించేందుకు ప్రకటనలు తప్ప సీరియస్ గా ఏమీ చేయకపోవడం వైసీపీ క్యాడర్ కు ధైర్యం రాకపోవడానికి మరో కారణంగా మారింది.
