వైసీపీ ప్రజల చేతిలో చావుదెబ్బతిని ఏడాదిన్నర అవుతోంది. ఈ ఏడాదిన్నరలో కనీసం కోలుకునే ప్రయత్నం చేయలేదు. యాక్టివ్ అయ్యేందుకు ముందుకు రాలేదు. జగన్ సహా అందరూ కలుగుల్లోనే ఉన్నారు. కనీసం పాతిక నియోజకవర్గాల్లో కూడా ఇంచార్జులు గట్టిగా తిరగడం లేదు. అక్కడో ఇక్కడో ఎవరైనా సీరియస్ గా పని చేస్తున్నారంటే .. వారంతా కొత్తగా ఇంచార్జ్ పోస్టులు వచ్చిన వాళ్లే. వాళ్లంతా బలవంతులు కాదు కానీ డబ్బున్నవాళ్లు. ఖర్చు పెట్టుకుంటున్నారు. అందుకే జగన్ మిగతా వారిని కూడా దారిలోకి తేవాలని అనుకుంటున్నారు. అందరూ నియోజకవర్గాల్లో తిరగాలని పిలిచి బుజ్జగిస్తున్నారు.
కొడాలి నాని, వంశీలను హెచ్చరించినట్లుగా వైసీపీ లీకులు
నియోజకవర్గాలను పట్టించుకోని వైసీపీ నేతలు వంద మంది ఉంటారు. వారిలో కొంత మందిని జగన్ పిలిపించుకుని నియోజకవర్గాల్లో పని చేసుకోకపోతే కొత్త వారిని చూసుకుంటానని హెచ్చరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో కొడాలి నాని, వంశీ కూడా ఉన్నారని చెబుతున్నారు. వీరి విషయంలో జగన్ రెడ్డి వేరే ఆలోచన చేస్తున్నారేమో కానీ వారినెందుకు ప్రత్యేకంగా హెచ్చరించారన్నది మాత్రం తెలియాల్సి ఉంది. వైసీపీ సోషల్ మీడియా ఇదే విషయాన్ని ఎందుకు హైలెట్ చేసిందో తెలియాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు కొడాలి నాని, వంశీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే జగన్ రెడ్డి వేసిన ట్రాప్ లో పడి.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినందుకు వాళ్లు ఎక్కడ దొరికినా.. గట్టి దెబ్బకొట్టడానికి టీడీపీ వెనుకాడదు మరి.
జగనే తిరగకుండా అందరికీ చెబితే ఎలా ?
అసలు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే తిరగడం లేదు. ఆయన ఏడాదిన్నర నుంచి బెంగళూరులోనే ఉంటున్నారు. వారానికి రెండు రోజులు తాడేపల్లికి వచ్చి పార్టీ కార్యక్రమాలను మమ అనిపించి పోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అంతా తానే అన్నట్లుగా పెత్తనం చెలాయిస్తున్నారు. తాను అన్ని జిల్లాలు తిరుగుతానని పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తానని జగన్ గతంలో ప్రకటించారు. కానీ మాట మార్చారు. అలాంటి పరామర్శలేవీ తన వైపు నుంచి ఉండవన్నారు. ఇప్పుడు ఒక్క పాదయాత్ర గురించి తప్ప.. ఆయన ప్రజల్లోకి వచ్చేందుకు ఎలాంటి కార్యచరణ ఉందో చెప్పడం లేదు. ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర చేస్తారు. మిగిలిన కాలం అంతా పార్టీని పట్టించుకోకపోతే మిగిలిన నేతలు మాత్రం ఎందుకు పని చేస్తారు.
స్టేజ్ షోలతో నడిచిపోతున్న వైసీపీ కార్యక్రమాలు
స్టేజ్ షోలతో వైసీపీ కార్యక్రమాలు నడిచిపోతున్నాయి. ఎప్పుడో ఓ సారి ఉనికి చాటుకోవడానికి అన్నట్లుగా జగన్ ఏదో ఓ సమస్య మీద ర్యాలీలు ప్రకటిస్తారు. పార్టీ నేతలు మమ అనిపిస్తారు. సాక్షిలో ప్రచారం చేసుకుంటారు. అంతే అయిపోతుంది. ప్రజల్లోకి వెళ్లే క్యాడర్ లేదు. కానీ జగన్ రెడ్డి ఎక్కడికి అయినా వెళ్తే అక్కడకు జనాల్ని తీసుకెళ్లి రప్ప..రప్ప అని కామెడీ చేయించే పనులు మాత్రం మానుకోరు. ఇలాంటి రాజకీయాలు చేయడానికి సీనియర్లు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. జగన్ బెదిరించినా.. ఇష్టం వచ్చింది చేసుకోమనే చెబుతారు కానీ.. తాము వెళ్తామని మాత్రం చెప్పరు.
