రాష్ట్ర ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రజాధనాన్ని వ్యక్తిగత ఆస్తులకు సోకులు చేసుకోవడానికి, సొంత పనులకు ఉపయోగించకూడదు. అధికార విధుల కోసం అయితే ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ జగన్ మాత్రం ఓటర్లు గెలిపించారు కానీ.. తన బాధ్యత, తన ఆస్తుల బాధ్యత, తన పార్టీ బాధ్యత అంతా ప్రజాసొమ్ము వాడుకోవచ్చని అనుకున్నారు. అందుకే ఆయన నిర్మోహమాటంగా ఐదు వందల కోట్ల ఆస్తిని కూలగొట్టి ఆరు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. ఇది కళ్ల ముందు కనిపించేది. రికార్డుల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఆ డబ్బులన్నింటినీ లెక్కలు తీసి ..ఆయన దగ్గర వసూలు చేయకపోయినా కనీసం ప్రజల ముందు పెట్టే ప్రయత్నం అయినా ప్రభుత్వం చేస్తుందా ?
సొంత ఇంటికి కిటీకీల నుంచి బయట ఇనుప కచ్చడాల వరకూ అంతా ప్రజాధనమే
జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాడేపల్లిలో రెండు ఎకరాల్లో రెండు ప్యాలెస్లు కట్టించుకున్నారు. ఒకటి క్యాంప్ ఆఫీస్.. ఇంకోటి ఇల్లు. రెండు ఎకరాల్లో నిర్మించిన ఇల్లు.. ఆయన గృహప్రవేశం చేసిన నాటికి మొండి గోడలు.. తలుపులు మాత్రమే ఉన్నాయి. సీఎం అయ్యాక ఆ ఇంట్లో ఇంటీరియర్ నుంచి కిటీకీల వరకూ అన్నీ ప్రజాధనంతో సమకూర్చుకున్నారు. తన ఇంటి చుట్టూ యాభై అడుగుల ఎత్తులో నిర్మించిన ఇనుప కచ్చడాలు కూడా ప్రభుత్వమే. ఇపక్పటికీ జగన్ రెడ్డి ప్రెస్మీట్లు పెట్టే చైర్, మైక్ కూడా ప్రభుత్వానిదే. ఇలా తన వ్యక్తిగత ఆస్తుల కోసం.. కనీసం వంద కోట్లు అయినా ఖర్చు పెట్టి ఉంటారని అంచనా.
పార్టీని నడుపుకుంది కూడా ప్రజాధనంతోనే !
జగన్ సీఎంగా ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ట్విట్టర్ హ్యాండిల్ లో అన్నీ పార్టీ కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్న దృశ్యాలే ఉండేవి. పార్టీ ఇంచార్జులుగా ఎవర్ని నియమించారో .. ఐ ప్యాక్ సమావేశాలు ఎవరితో పెట్టించేవారో చెప్పేవారు. ఇక బహిరంగసభల్ని కూడా ప్రజాధనంతో ఏర్పాటు చేసుకుని అన్ని రాజకీయ ప్రసంగాలు చేసేవారు. వాటితో పాటు పార్టీ కార్యకర్తల్ని కూడా ప్రజాధనంతో పోషించుకున్నారు. వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలకు విచ్చలవిడిగా ప్రజాధనంతో మేపారు. వివిద కార్పొరేషన్ల పేర్లతో అప్పులు తీసుకు వచ్చి వారికి చెల్లించారు. ఇక సాక్షిలో సగం మంది ఉద్యోగులకు ప్రభుత్వంలోనే ఉపాధి కల్పించారు. ఇలాంటివి లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ లెక్కలన్నింటినీ ప్రభుత్వం తీసిందో లేదో స్పష్టత లేదు.
ప్రభుత్వం లెక్క తీసి ప్రజల ముందు పెట్టాలి !
ప్రజాధనం పట్ల కూటమి నేతలు బాధ్యతగా ఉన్నారు. ప్రజలంటే వారికి భయం ఉంది. కానీ వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్ మాత్రం.. ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి .. ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం కనపిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికీ కనీసం ఫర్నీచర్ ను కూడా రికవరీ చేయలేకపోయింది. అదే ఫర్నీచర్ ను అడ్డం పెట్టుకుని కోడెల ఆత్మహత్య చేసుకునేలా ఈ జగన్ ప్రభుత్వం చేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం జగన్ చేసిన విచ్చలవిడి ఖర్చులు.. ప్రజాధనం వృధా గురించి మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు మొత్తం ఆ వివరాలన్నీ బయట పెట్టాలి.కేసులు పెట్టకపోయినా కనీసం ప్రజలకు తెలిసేలా చేయాలి.
