గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ జరగనుంది. జగన్ రెడ్డి తాను అసెంబ్లీకి వచ్చేది లేదని మంకుపట్టు పడుతున్నారు. తాను వెళ్లను కాబట్టి ఎమ్మెల్యేలు కూడా రారు అని చెబుతున్నారు. కానీ కనీసం ఎమ్మెల్యేలను అయినా పంపాలన్న సలహాలు ఆయనకు చాలా మంది ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే జగన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. బెంగళూరులో సెటిలైన ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని మంగళవారం తాడేపల్లికి వచ్చారు. హాజరు కాని దానికి ఎక్కడ ఉంటే ఏమి అని వైసీపీ నేతలు నిట్టూర్చారు కానీ.. ఆయన వెళ్లండి అని పర్మిషన్ ఇస్తే.. వెళ్లి అధ్యక్షా అని ప్రసంగించాలని ఎమ్మెల్యేలు ఆరాటపడుతున్నారు.
కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ఎక్కువ ఆసక్తితో ఉన్నారు. పెద్దిరెడ్డి లాంటి వాళ్లు జగన్ చేసిన నిర్వాకాల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారు. కుమారుడ్ని జైలుకు పంపుకుని మానసిక వేదనకు గురవుతున్నారు. ఆయన జగన్ రెడ్డి వెళ్లమన్నా వెళ్తారో లేదో తెలియడం లేదు. ఆయన రాజకీయంగా మాట్లాడటం కూడా మానేశారు. మిగిలిన వారిలో కొంత మంది అనర్హతా భయంతో జగన్ రెడ్డి వెళ్లమనకుపోయినా ఓ రోజు వెళ్లి సభలో కూర్చుని రావాలన్న ఆలోచనలో కూడా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా అమరావతి చేరుకున్నారు.
మరో వైపు ఎమ్మెల్సీలు మాత్రం సభకు హాజరు కానున్నారు. వారిలో ఆరుగురు రాజీనామా చేశారు. వారి రాజీనామాలు ఆమోదించకపోవడంపై మండలి చైర్మన్ కు కోర్టు ఫైన్ వేసింది. ఎన్నికలకు ముందు సరిగ్గా ఫిర్యాదులు కూడా చేయకుండా అనర్హతా వేటు వేసిన ఆయన..ఇప్పుడు రాజీనామా చేసిన లేఖలు ఇచ్చి నెలలు గడుస్తున్నా స్పందించడం లేదు. వారు ఇతర పార్టీల్లో చేరిపోయినా.. పట్టించుకోవడం లేదు అందితే జుట్టు .. అందకపోతే కాళ్లు అన్న చందంగా ఉన్న వైసీపీ తీరుపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.
