హిల్ట్ పాలసీ విషయంలో భారత రాష్ట్ర సమితి దూకుడుగా ఆరోపణలు చేస్తోంది. గతంలో తాము తీసుకు వచ్చిన పాలసీనే అయినా ఆ విషయాన్ని బయటకు రాకుండా.. ప్రస్తుతం ఉన్న పాలసీలో అసలు విషయాలపై చర్చ జరగకుండా చేసి.. ఏదో జరిగిపోతోందన్న భావన కల్పించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ నిజనిర్దారణ పేరుతో పర్యనటనలు కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న కౌంటర్లు ఎఫెక్టివ్ గా లేవు. వారు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారో.. ఈ అంశంపై ప్రజలు పెద్దగా నమ్మరని అనుకుంటున్నారో కానీ తూతూ మంత్రంగానే జవాబులు ఇస్తున్నారు.
ఫస్ట్ అవి ప్రభుత్వ భూములు కాదు.. పారిశ్రామికవేత్తలవే!
కోకాపేట భూములమ్మినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్మేస్తోందని చెప్పాలని కేటీఆర్ అనుకుంటున్నారు. అలాగే ప్రచారం చేస్తున్నారు. ఓ పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన ఆయన కోకాపేట భూములు ఎకరం 150 కోట్లు పలికితే.. దానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములు 100 కోట్లు పలకవా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన మాటల్లో లాజిక్ ఉందోలేదో కానీ.. కోకాపేట భూములను రూ. 300కోట్లు పెట్టి.. ప్రపంచస్థాయి సౌకర్యాలతో డెవలప్ చేసి అమ్ముతున్నారు. అవి ప్రభుత్వ భూములు. కానీ హిల్ట్ పాలసీలో మల్టీ యూజ్ కు చాన్స్ ఇచ్చే భూములు పారిశ్రామికవేత్తలవే. వారు పరిశ్రమలకే కాకుండా.. మల్టీయూజ్ కు వాడుకోండి అనే అనుమతి మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. ఆ విషయాన్ని కేటీఆర్ చెప్పడం లేదు. కాంగ్రెస్ చెప్పుకోవడం లేదు.
హిల్ట్ పాలసీ మరో రూపంలో బీఆర్ఎస్ హయాంలోనే అమలు
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని అంశాల్లో కీలమైన పాయింట్లన్నీ గత బీఆర్ఎస్ హయాంలోనే అమలయ్యాయి. అందుకే సీరీస్ కంపెనీకి చెందిన భూముల్లో వాసవి సంస్థ ఓ పెద్ద ఊరులాంటి ఆకాశహర్మ్యాలను నిర్మిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి భూములు చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి వాటిని మల్టీ యూజ్ కు మార్చడం ద్వారా ఆదాయంతో పాటు.. ఎకానమీ వృద్ధి చెందెలా చేయడానికి చేసింది. తెలంగాణ ప్రభుత్వం మల్టీయూజ్ కు అనుమతులు ఇవ్వకపోతే.. అవేమీ ప్రభుత్వానికి రావు. పారిశ్రామికవేత్తల దగ్గరే ఉంటాయి. కాకపోతే నిరుపయోగంగా పడి ఉంటాయి. కాలుష్య కారక పరిశ్రమలు నడుస్తున్నా.. మూసేస్తారు.
మంత్రులు ఎందుకు తమ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోరు !
ప్రతిపక్షం ఆరోపణలకు పొడిపొడిగా సమాధానాలిస్తున్నారు కానీ వారి వాదన ప్రజల్లోకి వెళ్తుందని చెప్పడం కష్టం. అంత సుతిమెత్తగా చెబుతున్నారు. శ్రీధర్ బాబు… మాూడు నాలుగు సార్లు ప్రెస్మీట్ పెట్టారు. పొంగులేటి పెట్టారు.కానీ అది బీఆర్ఎస్ వాదనను తిప్పికొట్టడానికి ికాకుండా.. వివరణ ఇవ్వడానికి అన్నట్లుగా ఉంది. ఇలాంటి విషయాల్లో ఎదురుదాడి చేసి బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రజలకు తెలిసేలా చేయకపోతే.. తరవాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినా ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్ కు ఐక్యత అనేదే ఉండదు. ఆ సమస్య తమది కాదనుకుంటారు. ఇప్పుడూ అలాగే అనుకుంటున్నారు.
