కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారని ఆయనపై విమర్శలు చేయబోనని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సహజంగానే అందరిలోనూ ఆసక్తి రేపాయి. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవరికీ తెలియదు. రేవంత్ రెడ్డికి ఏమైనా స్పష్టమైన సమాచారం ఉందేమో తెలియదు కానీ కేసీఆర్ మాత్రం పూర్తిగా ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. రాజకీయంగా అంతర్గత సమావేశాలకే పరిమితం అవుతున్నారు.
కేసీఆర్ ఆరోగ్యం బాగోలేకనే బయటకు రావడం లేదని బీఆర్ఎస్ ఇప్పటి వరకూ ప్రకటించలేదు. కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ సరైన సమయంలో బయటకు వస్తారని ఆ తర్వాత జరగబోయేది చరిత్ర అని చెబుతున్నారు. కానీ అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలోనూ ఆయన బయటకు రావడం లేదు. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదన్న రేవంత్ ప్రకటనపై బీఆర్ఎస్ స్పందించలేదు. ఇతర అంశాలపై కేటీఆర్ స్పందించారు కానీ.. కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడలేదు.
కేసీఆర్ ఆరోగ్యంపై చర్చ పెట్టడం ఇష్టం లేకనే కేటీఆర్ స్పందించలేదని తెలుస్తోంది. మరో వైపు కవిత మాత్రం కేసీఆర్ ఆరోగ్యం బాగుందన్నారు. కేసీఆర్ బయటకు వస్తే పరిస్థితి మరోలా ఉంటుందన్నారు. కేసీఆర్ తో కూడా సంబంధం లేదని జాగృతి తరపున రాజకీయాలు చేస్తున్న కవిత .. తండ్రి ఆరోగ్యం బాగుందని కవర్ చేసుకుకున్నారు. నిజానికి ఆమె తో కేసీఆర్ మాట్లాడటం మానేసి చాలా కాలం అయిందని ఆమె చెప్పారు. తల్లి మాత్రం మాట్లాడుతూ ఉంటారు. తల్లి నుంచి తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉంటారని అనుకోవచ్చు.
