పొడుగాటి టైటిళ్లకు మళ్లీ క్రేజ్ వచ్చేసింది. శివశంకర ప్రసాద్ గారు – సంక్రాంతికి వస్తున్నారు, భక్తమహాశయులకు విజ్ఞప్తి.. ఇలా బారెడున్న టైటిళ్ల వైపు దర్శకులు, హీరోలూ మొగ్గు చూపిస్తున్నారు. ఇలాంటి టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురములో, అరవింద సమేత వీర రాఘవ.. ఇలా ఆయన పేర్ల ప్రస్థానం సాగుతోంది. ఇప్పుడు వెంకీ సినిమా కోసం ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ పెడితే బాగుంటుందన్నది ఆయన ఆలోచన. దాదాపు ఈ పేరే ఫిక్సయ్యే అవకాశం ఉంది. నిజానికి చాలా మంచి టైటిల్ ఇది. క్యాచీగానూ ఉంటుంది. పేరులోనే ఫ్యామిలీ వైబ్ వుంది. వెంకీకి కూడా భలే సూటైపోతుంది. నిజానికి సంక్రాంతికి ఇలాంటి టైటిల్ తో వెంకీ లాంటి హీరో, త్రివిక్రమ్ లాంటి దర్శకుడు కలిసి ఓ సినిమా చేసి వదిలారంటే.. మామూలుగా ఉండదు. వెంకీ ఆలోచన కూడా అదే. త్రివిక్రమ్ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దామనుకొన్నారు. కానీ కుదర్లేదు.
మధ్యలో చిరంజీవి సినిమాలో కామియో చేయడం వల్ల, సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాల్సివచ్చింది. సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సంక్రాంతికి మిస్ అయినా, వేసవికి అందుకోగలిగితే మంచిదే. త్రివిక్రమ్ అంత స్పీడున్న డైరెక్టర్ కాదు. ఆయన సినిమాలు చెక్కుకొంటూ పోతారు. కాబట్టి లేట్ అయ్యే ఛాన్సుంది. ఇప్పటి వరకూ ఎంతమేర షూట్ అయ్యిందో కూడా తెలీదు. ఈమధ్యే షూటింగ్ మొదలైంది కాబట్టి… ఇంకా ఆరంభంలోనే ఉన్నట్టు లెక్క. మరి ఏప్రిల్ నాటికి పూర్తి చేసి, మే లోగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఈ టైటిల్ కి న్యాయం జరుగుతుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఫ్యామిలీ సెటప్ లో తక్కువ లొకేషన్లలో ఈ సినిమాని పూర్తి చేయాలనుకొంటున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా నుంచి ఓ అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. బహుశా.. టైటిల్ ని అతి త్వరలో రివీల్ చేసే అవకాశం ఉంది.
