The GirlFriend Movie Review
తెలుగు360 రేటింగ్:2.5/5
అమ్మాయిల కోణంలోంచి కొన్ని కథలు రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ హీరోల సినిమాలే కాదు, అప్పుడప్పుడూ హీరోయిన్ల కోసమూ కొన్ని సినిమాలు రావాలి.. చూడాలి. కొన్ని కథల్ని చెప్పాల్సిన బాధ్యత కూడా దర్శకులు, రచయితలపై ఉంటుంది. ‘గాళ్ ఫ్రెండ్’ అలాంటి కథే. కమర్షియల్ హీరోయిన్ గా తనకంటూ గుర్తింపు సంపాదించుకొంది రష్మిక. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. హీరోయిన్ గా తన కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఓ లేడీ ఓరియెంటెడ్ కథని ఎంచుకోవడం అది కూడా కమర్షియల్ మీటర్ కు దూరంగా వెళ్తూ ఓ కథ చెప్పాలనుకోవడం సాహసమే. ఆ సాహసం ఎలా సాగింది? ఇంతకీ రష్మిక – రాహుల్ రవీంద్రన్ ఎలాంటి కథ చెప్పాలనుకొన్నారు?
భూమా (రష్మిక) ఎం.ఏ లిటరేచర్ స్టూడెంట్. తండ్రి (రావు రమేష్)ని ఒప్పించి కాలేజీలో చేరుతుంది. అక్కడే హాస్టల్ లో ఉంటూ చదుకొంటుంది. తన ధ్యాస ఎప్పుడూ చదువు మీదే. అదే కాలేజీలో ఎం.ఎస్.సీ చదువుకొంటున్న విక్రమ్ (దక్షిత్ శెట్టి) అన్నింట్లోనూ చురుకే. దూకుడు ఎక్కువ. అమ్మాయిలంతా తన వెంట పడుతుంటారు. కానీ తాను మాత్రం భూమాని ఇష్టపడతాడు. భూమా కూడా మెల్లమెల్లగా విక్కీ ప్రేమలో పడిపోతుంది. కానీ విక్కీ చాలా పొసెసివ్. భూమా తనకు మాత్రమే సొంతం అనుకొంటాడు. ‘నేనుంటే నీకు ప్రపంచంతో పనేంటి’ అంటూ భూమాకి రకరకాల షరతులు విధిస్తుంటాడు. తనకు విక్కీ కరెక్టా, కాదా? అనే అనుమానం భూమాని వెంటాడుతుంటుంది. ఓ సందర్భంలో తండ్రికి చూడరాని స్థితిలో దొరికిపోతుంది భూమా. తండ్రి కూడా కూతుర్ని కాదని ఒంటరిగా వదిలేస్తాడు. అటు ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాలో వద్దో తేల్చుకోలేక సతమతమవుతున్న భూమా.. మరోవైపు తండ్రి నమ్మకాన్ని కూడా కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భూమా ప్రయాణం ఎటువైపు సాగింది? చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకొంది? అనేదే ‘ది గాళ్ ఫ్రెండ్’.
ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకొని, బ్రేకప్ చెప్పుకొంటే – అందులోనూ ఆ బ్రేకప్ ప్రపోజల్ అమ్మాయి నుంచే వస్తే… తప్పంతా అమ్మాయిదే అన్నట్టు చూపిస్తారు. ‘వాడుకొని వదిలేసింది’ అని నిందలేస్తారు. ఇవన్నీ మాట్లాడుకోవడానికి హాట్.. హాట్ గా ఉండే విషయాలు. కానీ ఈ విషయాన్ని అమ్మాయి కోణంలోంచి చూస్తే, వాళ్లు పడే బాధలు అర్థం అవుతాయి. పెళ్లి, ప్రేమ పేరుతో అమ్మాయిలు తమ హక్కుల్ని ఒకొక్కటిగా కోల్పోవాల్సివస్తుంది. అప్పటికే చాలా దూరం ప్రయాణం చేసేస్తారు. కాబట్టి వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ‘నీకేం కావాలో నిర్ణయించుకొనే హక్కు నీకు ఉంది’ అని బలంగా చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ఇది. చివర్లో భూమా చెప్పిన నాలుగు మాటలూ, మధ్యమధ్యలో రాహుల్ రవీంద్రన్ అమ్మాయిల కోణం నుంచి చెప్పే విషయాలే ఈ కథకు మూలం.. ప్రాణం. అవి అర్థం చేసుకొంటే, వాటితో సింపతైజ్ అయితే… ఈ సినిమా మీకు నచ్చినట్టే.
కాలేజీలో హీరో, హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ కథ మొదలవుతుంది. కాలేజీ సన్నివేశాలు, అక్కడి వాతావరణం చూపిస్తూ.. మెల్లమెల్లగా కథలోకి వెళ్లాడు. భూమా – విక్కీల పరిచయం, వాళ్లు ప్రేమలో పడడం, విక్కీలోని లోపలి మనిషి క్రమంగా బయటకు రావడంతో కథ లో ఆసక్తి మొదలవుతుంది. విక్కీ భూమాకు కరెక్టా, కాదా? అనే ప్రశ్న ఇటు ప్రేక్షకుల్లోనూ కలుగుతుంది. ఇంట్రవెల్ లో.. విక్కీ ఇంటికి భూమా వెళ్లే సీన్.. అక్కడ రోహిణి పాత్ర ప్రవర్తించే విధానంతో అసలు సంఘర్షణ ఎటువైపు నుంచి మొదలవుతుందో క్లియర్ కట్ గా చెప్పేశాడు.
రావు రమేష్ పాత్ర రంగ ప్రవేశం చేయడంతో డ్రామా మరింత రక్తి కట్టింది. ప్రేమించినవాడికీ, తండ్రికీ మధ్య నలిగిపోయే సన్నివేశాల్ని కూడా బాగా తీర్చిదిద్దారు. దుర్గా (అను ఇమ్మానియేల్) పాత్ర తొలుత చాలా రొటీన్ గాళ్ లా అనిపిస్తుంది కానీ, ఆ పాత్రలో కూడా పరిపక్వత బాగా నచ్చుతుంది. సెకండాఫ్ లో బ్రేకప్ చెప్పే సీన్ కూడా బాగానే ఉన్నా.. ఎందుకో అక్కడి నుంచే లాగ్ మొదలవుతుంది. సమాన హక్కుల్ని అడ్రస్ చేయాల్సిన చోట… `బ్యాక్ లాగ్స్ ఉన్నాయి కదా.. నన్నెలా పోషిస్తావు` అనడం బాలేదు. అక్కడ హీరోయిన్ పాత్రని డీ గ్రేడ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ దొరుకుతుంది. `నీ ఇంటికెళ్లి చూశా. నీ తల్లిలో నాకు నేను కనిపించా.. రేపు మన పెళ్లయితే నా పరిస్థితి కూడా అదే కదా` అని ప్రశ్నించాల్సిన చోట.. ఉద్యోగం సంపాదన గురించి మాట్లాడం సరి కాదనిపిస్తుంది. చివర్లో రష్మిక ఇచ్చే ఆ స్పీచ్, అక్కడ చెప్పే డైలాగులు యూత్ కి ముఖ్యంగా అమ్మాయిలకు కనెక్ట్ అవుతాయి. సినిమా చూస్తున్నంత సేపూ.. ‘ఇలాంటి బోయ్ ఫ్రెండ్ మనకొద్దు’ అని అమ్మాయిలు ఫీలయితే.. దర్శకుడిగా రాహుల్ ప్రయత్నం సక్సెస్ అయినట్టే.
రష్మిక ఈ కథని బలంగా నమ్మింది. అందుకే తన పూర్తి స్థాయి ప్రతిభ చూపించగలిగింది. ఈ పాత్రలో కొంత అమాయకత్వం, ఇంకొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ రెండింటినీ సమానంగా పలికించింది. చివరి పది నిమిషాలూ రష్మిక విజృంభిస్తుంది. కమర్షియల్ గా ఈ సినిమా ఎలా ఉన్నా, నటిగా తనకు పూర్తి సంతృప్తి ఇస్తుంది. దక్షిత్ శెట్టి కూడా నటుడిగా మంచి మార్కులు కొట్టేస్తాడు. ఈ పాత్రలో తెలుగు హీరో నటిస్తే బాగుండేది అనిపించినా… పాత్ర సాగే తీరు చూస్తే ‘తెలుగు హీరోలు చేయరులే’ అనే నిర్ణయానికి వచ్చేస్తారు ప్రేక్షకులు. రావు రమేష్ కనిపించేది రెండు మూడు సీన్లే. కానీ తన ఇంపాక్ట్ చూపించాడు. ముఖ్యంగా రాహుల్ రవీంద్రన్ తో మాట్లాడే సీన్ లో.. ఆయన మార్క్ సంభాషణలు బాగా పేలాయి.
రాహుల్ ఓ కథని బలంగా నమ్మి.. తాను రాసుకొన్న పాయింట్ ని నూటికి నూరు పాళ్లూ ఎలాంటి త్రోటుపాట్లూ లేకుండా ఆవిష్కరించాలనుకొన్నాడు. ఆ ప్రయాణంలో `లాగ్` ఉన్నా.. ఆలోచించలేదు. స్లో ఫేజ్ ఇబ్బంది పెడుతుంది. భూమా పాత్ర చాలా లేట్ గా రివోల్ట్ అయ్యిందన్న ఫీలింగ్ వస్తుంది. సినిమాటిక్ డైలాగులు చాలా తక్కువగా వినిపించాయి. పాటలు సందర్భానికి తగ్గట్టుగా వినిపించాయి. నేపథ్య సంగీతం సీన్‌ని, కంటెంట్ ని బలపరిచింది. సకుటుంబ సమేతానికి నచ్చే సినిమా కాదిది. భూమా పాత్రతో ట్రావెల్ అయిన వాళ్లు, ఓన్ చేసుకొన్న వాళ్లకు మాత్రమే నచ్చే కంటెంట్ ఇది. మిగిలిన వాళ్లకు సో…సోగా అనిపిస్తుంది. కాకపోతే నిజాయితీతో చేసిన ప్రయత్నాన్ని మనసారా మెచ్చుకొని తీరాలి. ముందే చెప్పినట్టు కొన్ని కథలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అలాంటి కథే.
తెలుగు360 రేటింగ్:2.5/5
