సుకుమార్ దగ్గర ఓ గొప్ప అలవాటు ఉంది. తన శిష్యుల చేయిని ఆయన ఎప్పుడూ వదలరు. తాను దర్శకుడిగా ఎదుగుతూనే, తనతో పాటు మిగిలినవాళ్లకూ చేయూత అందిస్తుంటారు. సుకుమార్ రైటింగ్స్ అందుకే పుట్టింది. ఈ సంస్థ నుంచి వచ్చిన ప్రతీ సినిమా బాక్సాఫీసుకు ఓ మంచి విజయాన్ని అందివ్వడమే కాదు. చాలామంది భవిష్యత్తుని దిశానిర్దేశం చేసింది. బుచ్చిబాబు, ప్రతాప్, కార్తీక్ దండు వీళ్లంతా సుకుమార్ అండదండలతో ఎదిగిన వాళ్లే. సుకుమార్ రైటింగ్స్ సంస్థ ప్రయాణానికి నేటితో సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి. ఈ దశాబ్దకాలంలో ఈ సంస్థకు ఎన్నో విజయాలు. అందులో పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లూ, కుమారి 21 ఎఫ్ లాంటి యూత్ సినిమాలూ, గాంధీ తాత చెట్టు లాంటి సామాజిక ప్రయోజనం ఉన్న కథలూ ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో ఎలాంటి సినిమాలు చేయాలన్న విషయంలో సుకుమార్ చాలా ప్రణాళికా బద్ధంగా ఆలోచిస్తున్నారు.
2025-26 మధ్యకాలంలో సుకుమార్ రైటింగ్స్ నుంచి ఏకంగా 6 సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. దాదాపుగా అందరూ సుకుమార్ శిష్యులే. సుకుమార్ దగ్గర శిష్యరికం చేయకపోయినా, కథ నచ్చితే చాలు… సుకుమార్ తన బ్యానర్లో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే సుకుమార్ రైటింగ్స్ నుంచి ఇన్ని సినిమాలు వస్తున్నాయి. పేరున్న నిర్మాణ సంస్థలు కూడా సుకుమార్ రైటింగ్స్ తో టైఅప్ అయి సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ సుకుమార్ రైటింగ్స్ కలయికలో కొన్ని సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలతో సుకుమార్ ప్రతిభావంతులకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకొన్నారు. బహుశా ఈ జనరేషన్లో ఓ దర్శకుడి నుంచి ఇంత మంది శిష్యులు బయటకు రావడం, వాళ్లంతా సినిమాలతో బిజీ అవ్వడం సుకుమార్ తోనే సాధ్యమైందేమో..? ప్రస్తుతం రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి తగిన కథ తయారు చేసే పనిలో ఉన్నారు సుకుమార్. దాంతో పాటుగా తన శిష్యుల ప్రాజెక్టుల పనుల్లోనూ తలమునకలైపోయారు. త్వరలో సుకుమార్ రైటింగ్స్ నుంచి రాబోయే సినిమాలకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రావొచ్చు.
