‘పెద్ది’ తరవాత రామ్ చరణ్ – సుకుమార్ ల కాంబోలో ఓ సినిమా ఉంటుంది. ‘పుష్ప 2’ తరవాత సుకుమార్ చేసే సినిమా ఇదే. ఆమధ్య సుకుమార్ తన టీమ్ తో కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడ చరణ్ సినిమాకు సంబంధించిన స్టోరీ సిట్టింగ్స్ జరిగాయన్న ప్రచారం జరిగింది. కానీ సుకుమార్ దుబాయ్ వెళ్లింది చరణ్ కోసం కాదు.. తన శిష్యుల కోసం.
సుకుమార్ దగ్గర ఓ మంచి అలవాటు వుంది. తన శిష్యుల్ని ఆయన బాగా ప్రమోట్ చేస్తారు. సుకుమార్ శిష్యులంతా మంచి విజయాలు అందుకొని.. పరిశ్రమ దృష్టిని ఆకర్షించినవాళ్లే. ఆ ప్రయాణంలో సుకుమార్ భాగస్వామ్యం మర్చిపోలేనిది. ఇప్పుడు కూడా సుకుమార్ తన శిష్యుల కెరియర్ని సెట్ చేసే పనిలో ఉన్నారు. దాదాపు అరడజను సినిమాలు సుకుమార్ రైటింగ్స్ లో ప్రారంభం కానున్నాయి. దర్శకులంతా సుకుమార్ శిష్యులే. ఈ ఆరు కథల్లో కొన్ని సెట్ చేయడానికి ఆయన తన శిష్యులతో దుబాయ్ వెళ్లారు.
సుకుమార్ శిష్యగణంలో మాధురి అనే అమ్మాయి ఉంది. తను ఓ కథ రాసుకొంది. ఆ కథతో సుకుమార్ రైటింగ్స్ లో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. మేం ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించబోతున్నాడు. వీరా అనే దర్శకుడితో మరో సినిమా సెట్ చేశారు. ‘పుష్ప’ టీమ్ లో కీలక సభ్యుడు వీరా. తన కథ సుకుమార్ ఓకే చేశారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తారు. 2026 వేసవిలో ఈ సినిమా మొదలవుతుంది. ఇవికాక మరో నాలుగు కథలు రెడీ అయ్యాయి. ఇవన్నీ సుకుమార్ రైటింగ్స్ లోనే వస్తాయి. టాలీవుడ్ లోని కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకొంటాయి.
