కల్తీ నెయ్యి కోసం లీటర్ కు రూ. పాతిక కమిషన్ తీసుకున్నట్లుగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన మాజీ పీఏ అప్పన్న అకౌంట్లలో ఆ డబ్బులు వేయించి.. తర్వాత తాను తీసుకున్నారు. అయితే ఇప్పుడు సుబ్బారెడ్డి మాత్రం.. నెయ్యి నిర్ణయాలేమీ తనవి కావని.. అంతా అధికారులే చూసుకున్నారని చెప్పుకొస్తున్నారు. అధికారులంటే ఎవరో కాదు.. జగన్ రెడ్డి తరపున కొండ మీద రాజ్యం ఏలిన ధర్మారెడ్డి. అంతా ఆయనే చేశారని సుబ్బారెడ్డి చెబుతున్నారు.
సుప్రీంకోర్టు నియమించిన సిట్ నోటీసులు జారీ చేస్తే తనకు.. హెల్త్ బాగో లేదని .. మీరే రావాలని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో ప్రశ్నించారు. ఇంట్లో సోదాలు చేసి కీలక సమాచారం కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. ఆధారాలన్నీ స్పష్టంగా ఉండటంతో వైవీ సుబ్బారెడ్డి .. దేన్నీ ఖండించలేకపోయారు. కల్తీ అని తెలిసినా నెయ్యి ఎందుకు తీసుకున్నారంటే.. అంతా అధికారులే చూసుకున్నారని చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు ధర్మారెడ్డి కూడా తాను అంగీకరించానంటే.. దాన్ని ఆమోదించిన వాళ్లు కూడా తప్పు చేసినట్లే కదా అని అడ్డగోలుగా ఇతరుల్ని కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. ఆయన ఐఏఎస్ కాదు.. ఓ సాధారణ రక్షణ శాఖ ఉద్యోగి. ఆయనను తీసుకొచ్చి టీటీడీపై పెత్తనం ఇచ్చారు. డిప్యూటీ ఈవో పదవి ఇచ్చారు. అప్పట్లో కొన్నాళ్లు సింఘాల్.. మరికొన్నాళ్లు జవహర్ రెడ్డి ఈవోలుగా చేశారు. కానీ వీరిద్దరూ నామమాత్రమే. అంతా ధర్మారెడ్డినే చూసుకునేవారు. తర్వాత ఆయనే ఈవో అయ్యారు. అయినా నేను సంతకం చేశాను.. దాన్ని ఆమోదించిన వారిదీ తప్పేగా అంటున్నారు.
ఇప్పుడు సుబ్బారెడ్డి తాను తప్పించుకోవడానికి అంతా అధికారులే చేశారని అంటున్నారు. కానీ కమిషన్లు మాత్రం ఆయన తీసుకున్నారు. అవి ఆధారాలతో సహా ఉన్నాయి. ఇప్పుడు అనారోగ్యం పేరుతో ఆయన తప్పించుకునేందుకు ప్రయత్నించవచ్చు కానీ.. చేసిన తప్పుని మాత్రం దాచుకోలేరు. ఎందుకంటే వారు అవినీతి ఆట ఆడింది దేవుడితోనే.
