ప్రజలు ఎమ్మెల్యేగాలుగా గెలిచిపించినా వైసీపీ నేతలు అసెంబ్లీకి రావడం లేదు. ప్రజాసమస్యలపై గొంతెత్తడంలేదు. కానీ పిల్లలు మాత్రం దడదడలాడించబోతున్నారు. పాఠశాల విద్యార్థులు తమ నియోజకవర్గాల సమస్యలపై గొంతు వదలుకునేందుకు, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా, వైవిధ్యంగా నడపడానికి ఏర్పాట్లు చేస్తోంది.
రాజకీయాలు,ప్రజాస్వామ్యం పనితీరుపై అవగాహన
ఈ నెల 26న ఉదయం 9 గంటలకు స్టూడెంట్ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. పాల్గొంటున్న విద్యార్థుల్లో ఒకరు ప్రోటెం స్పీకర్గా సభను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క విద్యార్థి ఎమ్మెల్యేగా పనిచేస్తారు. వీరిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలుగా కూడా విద్యార్థులే వ్యవహరిస్తారు. సెక్రటరీ జనరల్, మార్షల్స్ పదవుల్లో కూడా విద్యార్థులే ఉంటారు.
సాధారణ అసెంబ్లీ లాగే వ్యవహారాలు
సాధారణ అసెంబ్లీల్లాగే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, రెండు బిల్లులపై చర్చలు, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయి. సుమారు 3 గంటల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు దీనిని వీక్షించేలా ఏర్పాటు ఉంటుంది. ప్రజలు కూడా చూసేలా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. లఇప్పటికే పాఠశాల విద్యాశాఖ 8, 9, 10 తరగతుల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. పాఠశాల స్థాయి నుంచి వివిధ దశల్లో పోటీలు నిర్వహించారు.
నాయకత్వ లక్షణాలను పెంచే వినూత్న ప్రయోగం
అసెంబ్లీలో సగం మంది అమ్మాయిలు, సగం మంది అబ్బాయిలు ఉంటారు. ఇప్పటివరకు ఝార్ఖండ్, రాజస్థాన్, హరియాణా, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ కార్యకలాపాలను పూర్తిగా ప్రతిబింబించేలా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశం విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవరిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
