వైసీపీని టార్గెట్ చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఏడుపొక్కటే తక్కువన్నట్లుగా బిక్కుబిక్కుమంటూ మీడియాతో మాట్లాడుతూ ఆరోపిస్తున్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని అందుకే టీటీడీ లడ్డూ కల్తీ కేసు, పరకామణి కేసుతో వైసీపీని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
లడ్డూ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లి సెట్ విచారణ తెచ్చుకుంది వైసీపీ. ఇప్పుడు ఆ విచారణను కూడా తప్పు పడుతున్నారు. వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోంది.. పారదర్శకంగా విచారణ జరగడం లేదని అంటున్నారు. పారదర్శకం అంటే ఏమిటో ఆయన చెప్పడం మర్చిపోయారు. అన్ని విషయాలను పూర్తి స్థాయిలో సీబీఐ సెట్ బయటపెడుతోంది. నెయ్యి కాని నెయ్యితో కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు అమ్మారని సీబీఐ సెట్ చెబుతూంటే.. తాము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదని వాదిస్తున్నారు.
అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడు ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది.. నెయ్యి కల్తీ జరిగిందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అమాయకంగా అడిగే వారి జాబితాలో సజ్జల మొదటి స్థానంలో ఉంటారు. కల్తీ ఎలా జరిగిందో మొత్తం సీబీఐ సిట్ చెబుతూంటే.. ఏ ప్రాతిపదిక అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. పెళ్లికెళ్లినా.. తద్దినానికి వెళ్లినా రప్పా.. రప్పా పేరుతో పోస్టర్లు పెట్టుకోడం ఏమిటని మీడియా ప్రశ్నిస్తే.. దాని అర్థం మళ్లీ గెలుస్తామని సజ్జల వివరించారు. ఆయన మాటలు విని.. కారుమూరి నాగేశ్వరరావును గుర్తు చేసుకుని.. బుజ్జికన్నా అనుకుని జర్నలిస్టులు కూడా జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయి ఉంటారు.
