అధికారులు ఇంకా దారికి రాలేదని సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా విజయోత్సవాలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అసలు అధికారుల పనితీరు ఎలా ఉందో అని కాస్త సుదీర్ఘంగా సీఎస్‌ను కూర్చోబెట్టుకుని ఇతర ముఖ్య ఉన్నతాధికారుల్ని పిలిపించి సమీక్ష చేశారు. ఇందులో గత రెండేళ్ల కాలంలో జరిగిన తప్పులు.. అధికారుల నిర్లక్ష్యం వల్ల వచ్చి పడిన సమస్యలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. దీంతో రేవంత్ కు అసహనం కలిగినట్లుగా ఉంది. అందుకే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
అధికారుల సొంత నిర్ణయాలంటే .. చిన్న విషయం కాదు!
అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇలా అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని .. దాని వల్ల చెడ్డపేరు వస్తుందని అనడం అంటే.. ఆయనకు ఇంకా పాలనపై పట్టు చిక్కనట్లేనని ఎక్కువ మంది అనుకుంటారు. ముఖ్యమంత్రి అంటే కేవలం ఓ వ్యక్తి కాదు. ఓ వ్యవస్థ. ఆయన ఆలోచనలు.. విధానాలను తెలుసుకుని దాని ప్రకారం అన్నీ జరిగిపోయేలా చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన ఉంటుంది. కానీ అలాంటి వ్యవస్థ ఏర్పాటు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి మాటల ద్వారానే స్పష్టమవుతోంది.
రేవంత్ చుట్టూ ఓ వల.. ఎన్నో ఒత్తిళ్లు
రేవంత్ రెడ్డి అధికారులపై పట్టు సాధించలేకపోయారు. దీనికి కారణంగా ఎక్కువగా.. ఆ అధికారుల నియామకాలు సీఎం రేవంత్ రెడ్డి చాయిస్ కాదని.. వివిధ రకాలుగా వచ్చిన సిఫారసులు.. ఒత్తిళ్ల కారణంగా వారికి ఆయా పోస్టులు ఇవ్వాల్సి వచ్చిందనేది ఎక్కువ మంది నమ్మే ఓ అభిప్రాయం. అందులో కొంత వరకూ నిజం ఉంటుంది. రేవంత్ రెడ్డి తన పాలన తాను చేయలేకపోతున్నారని ఎక్కువ మంది భావిస్తున్నారు . ఆయనను అలా సీఎం పోస్టులు ఉంచి.. తమ పాలన సాగాలని చూసుకునేవారు చాలా మంది కనిపిస్తున్నారు.
రేవంత్ తెగిస్తే అసలు పాలన, రాజకీయం
ఇప్పటికైతే రేవంత్ .. కేసీఆర్ అంతటి బలమైన నాయకుడిగా.. అధికార వర్గాలపై పట్టు చూపించలేకపోతున్నారు. చివరికి మంత్రి వర్గంలో ఏర్పడిన విబేధాల విషయంలోనూ ఆయన గట్టిగా వ్యవహరించ లేకపోతున్నారంటే ఆయన చేతుల్ని ఎంతగా కట్టి పడేశారో అర్థం చేసుకోవచ్చు. అయినా రేవంత్ వీలైనంత వరకూ సహనంతోనే పరిపాలన చేస్తున్నారు. ఎప్పుడైనా ఆయనలో కోపం కట్టలు తెంచుకుని.. డోంట్ కేర్ అన్న పరిస్థితికి వస్తే… రాజకీయాలు, పాలన ఎలా ఉంటుందో చెప్పడం కష్టమేమో ?
