ఇండిగో సంస్థ పైలట్లను నియమించుకోకపోవడం వల్ల ఏర్పడిన సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణం అవుతోంది. ఈ సంక్షోభంలో ఎవరో ఒకర్ని కారణం చేసి నిందిస్తే తప్ప సోకాల్డ్ మేధావులకు ఆత్మసంతృప్తి ఉండదు. కడుపు ఉబ్బరం తగ్గదు. అందుకే తేరగా కనిపిస్తున్నాడని.. పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మీదకు వచ్చేస్తున్నారు. ఇంత జరుగుతూంటే ఆయనేం చేస్తున్నారు అంటున్నారు. కాస్త ఆలోచిస్తే.. ప్రైవేటు విమానయాన సంస్థల రోజువారీ వ్యవహారాలు, వారి పైలట్లు, సిబ్బంది సామర్థ్యంతో కేంద్ర మంత్రికి ఏం పని ఉంటుందో అర్థం అవుతుంది . కానీ అలా చేయడం లేదు.
సంక్షోభం గురించి బయటకు వచ్చిన వెంటనే రామ్మోహన్ నాయుడు చర్యలు
ఇండిగో ప్రయాణికుల్ని సతాయించడం ప్రారంభించిన వెంటనే రామ్మోహన్ నాయుడు చర్యలు తీసుకున్నారు. అప్పటికప్పుడు డీజీసీఏను ఒప్పించి పైలట్ల కు పెట్టిన పరిమితిల నుంచి రిలీఫ్ ఇప్పించారు. తమ సంక్షోభాన్ని దాచి పెట్టిన ఇండిగోపై అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే సమస్య మరింత పెద్దది అవుతుంది. అందుకే వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇతర ఎయిర్ లైన్స్ కు అదనపు విమానాలు నడిపే అవకాశం కల్పించారు.రేట్లు పెంచేస్తున్నారని తెలుసుకుని వెంటనే.. ధరలపై క్యాప్ కూడా విధించారు. తన ఆఫీసులోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి.. సంక్షోభనివారణకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు.
ప్రైవేటు సంస్థ సంక్షోభాన్ని కేంద్ర మంత్రి ఎలా గుర్తించగలరు?
సమయపాలనకు మంచిపేరు తెచ్చుకున్న ఇండిగో… విమాన సర్వీసుల విషయంలో ఇంత ఘోరంగా విఫలమవుతుందని ఎవరూ అనుకోలేరు. కొత్త నిబంధనల అమలుకు ఏడాదిన్నర సమయం ఇచ్చినా నిర్లక్ష్యం చేశారు. అది ప్రైవేటు సంస్థ . రోజువారీ సంస్థ వ్యవహారాలు ప్రభుత్వానికి చెప్పాల్సిన పని లేదు. డీజీసీఏ కూడా కేవలం ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశాలే చూస్తుంది కానీ వారి మ్యాన్ పవర్ , ఆర్థిక సమస్యల గురించి చూడదు. అయితే ఈ సంక్షోభానికి రామ్మోహన్ నాయుడును బాధ్యుడ్ని చేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు.
ఇండిగో గుత్తాధిపత్యమే అసలు సమస్య
ఇండిగో దేశీయ విమానయాన మార్కెట్లో అరవై శాతం షేర్ కలిగి ఉంది. ఇతర సంస్థలు ఆ స్థాయిలో పుంజుకోలేకపోతున్నాయి. ధరలు కానీ.. సర్వీస్ కానీ..సమయపాలన కానీ.. అన్నింటిలోనూ ఇండిగో ముందే ఉంది. పైగా మంచి లాభాలను ఆర్జిస్తోంది. ఇతర విమానయాన సంస్థలను కూడా అదే స్థాయిలో ఎదిగేలా కేంద్రం ప్రోత్సాహకాలు ఇచ్చి.. ఇండిగో గుత్తాధిపత్యాన్ని నివారించాల్సి ఉంది. లేకపోతే ఒకరి సమస్య.. దేశ సమస్య అవుతుంది. దానికి .. సంబంధంలేని వాళ్లను బలి చేసేందుకు కొంత మంది మేధావులు బయలుదేరి వస్తారు.
