రామ్ చరణ్ మంచి డాన్సర్. చిరంజీవిలానే తన డాన్స్ లోనూ గ్రేస్ ఉంటుంది. ప్రతీ పాటలోనూ, ప్రతీ మూమెంట్ లోనూ… ఆ గ్రేస్ కనిపిస్తుంది. అయితే ‘గేమ్ ఛేంజర్’ లో తన గ్రేస్ కి సరిపడా పాటలు వినిపించలేదు. అయితే ‘పెద్ది’తో ఆ లోటు తీరబోతోంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని తొలి పాట ‘చికిరి..’ ఈరోజే విడుదలైంది. బాలాజీ సాహిత్యం అందించారు. జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. మోహిత్ చౌహాన్ ఆలపించారు. ఇష్టపడిన అమ్మాయి అందాన్ని పొగుడుకుంటూ హీరో పాడుకొనే పాట ఇది. సెట్యువేషన్ రెగ్యులర్ గానే ఉంది. కానీ జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు, బాలాజీ సాహిత్యం, రెహమాన్ ట్యూన్, రత్నవేలు ఫొటోగ్రఫీ ఈ పాటకు కొత్త అందాల్ని తీసుకొచ్చాయి.
ఆ చంద్రుళ్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్లంతా ఆడిందే తైతక్క
దీనందాలో లెక్క
దీనేషాలో తిక్క
నా గుండెల్లో పడతాందే ఉక్క… ఇలా మొదలైంది పాట.
ఆ ముక్కుపై ఏంటీ కోపం
తొక్కేశావే ముక్కెరందం
చింతాకులా ఉందే పాదం
చిరాకులే నడిచే వాటం…
ఏం మొక్కావో అందాలు
ఒళ్లంతా ఒంకీలు
నీమధ్యే దాగిందా తాటికళ్లు..
కూసింతే సూత్తే నీ నకరాలు
రాసేస్తా ఎకరాలు
– ఇలా చరణంలో అక్కడక్కడా చమక్కులు పడ్డాయి.
మోహిత్ స్వరం కొత్తగా ఉన్నా, కొన్ని తెలుగు పదాలు సరిగా వినపడలేదు. కాకపోతే వింటూ వింటూ ఉంటే… ఎక్కేసే పాటే. అన్నింటికంటే ముఖ్యంగా చరణ్ స్టెప్పుల గురించి మాట్లాడుకొంటారు. జాన్వీకపూర్ కూడా గ్లామరస్ గా కనిపించింది. వీరిద్దరి జోడీ తప్పకుండా ఆకట్టుకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లింప్స్ లో చూపించిన బ్యాటింగ్ స్టైల్… ఈ పాటలోనూ రిపీట్ చేశారు. పెద్ది ఆల్బమ్ కి మంచి ప్రారంభమే ఇది. మిగిలిన పాటలు ఎలా ఉంటాయో చూడాలి.
