Raju weds Rambai movie review
తెలుగు360 రేటింగ్: 2.5/5
ఈటీవీ విన్ కంటూ ఓ బ్రాండ్ ఏర్పడింది. ’90’, ‘లిటిల్ హార్ట్స్’… ఈ సంస్థ ప్రతిష్టకు చిహ్నాలుగా మారాయి. దాంతో ఈటీవీ విన్ నుంచి ఓ సినిమా వస్తోందంటే – అటు వైపు చూపులు మళ్లుతున్నాయి. ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా అలానే అటెన్షన్ తెచ్చుకొంది. `నీదీ నాదీ ఒకే కథ`, `విరాటపర్వం`లాంటి సినిమాల్ని అందించిన వేణు ఉడుగుల ఈ చిత్రానికి షోరన్నర్‌గా నిలవడం, `ఈ సినిమాకు నెగిటీవ్ టాక్ వస్తే.. అమీర్ పేట రోడ్డు మీద నగ్నంగా తిరుగుతా` అని దర్శకుడు శపథం చేయడంతో ఆ ఫోకస్ మరింత పెరిగింది. మరి ఈ రాజు, రాంబాయి ఎలా ఉన్నారు? వీళ్ల శపథాలు, బ్రాండ్ వాల్యూ, ప్రేక్షకులు పెట్టుకొన్న నమ్మకాలు ఎంత వరకూ నెగ్గాయి? ఈ సినిమా క్లైమాక్స్ షాకింగ్ గా ఉంటుందని చిత్రబృందం చాలా నమ్మకంగా, గట్టిగా చెప్పింది కదా.. నిజంగా ఆ క్లైమాక్స్ లో అంతగా కదిలించే విషయం ఏముంది?
2010లో తెలంగాణలోని ఓ పల్లెటూర్లో జరిగే కథ ఇది. అక్కడ రాజు (అఖిల్ రాజ్) పెళ్లిళ్లకు బ్యాండ్ వాయిస్తుంటాడు. అదే ఊర్లో ఉంటున్న రాంబాయి (తేజస్వీరావు)ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమకు.. రాంబాయి కూడా పడిపోతుంది. రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) అదోరకమైన వ్యక్తి. పొగరు, అహంకారం మొండు. ఎవరి మాటా లెక్క చేయడు. తనకున్న అంగవైకల్యం కప్పిపుచ్చుకోవడం కోసం చాలా పాట్లు పడుతుంటాడు. కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగి అయ్యుండాలని పట్టుపడుతుంటాడు. రాజు, రాంబాయ్ ప్రేమకథ ఊరంతటికీ తెలిసిపోతుంది. ఆఖరికి వెంకన్న కూడా. ఈలోగా ఈ ఊరు వదిలి పారిపోవాలని రాజు, రాంబాయి నిర్ణయం తీసుకొంటారు. ఆ తరవాత ఏమైంది? ఈ ప్రేమకథకు ఎదురైన అవాంతరాలు ఏమిటి? వెంకన్న మొండితనాన్నీ, మూర్ఖత్వాన్నీ ఎదిరించి ఈ జంట నిలబడగలిగిందా, లేదా? అనేది మిగిలిన కథ.
ఇది కథ కాదు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన కథ. రాజు, రాంబాయి పాత్రలు, వాళ్ల సంఘర్షణ జీవితాల్లోంచి తీసుకొన్నదే. ఊరంతా నిర్ఘాంతపోయేలా, సభ్యసమాజం అవాక్కయ్యేలా జరిగిన ఓ ఘటన నుంచే ఈ కథ పుట్టింది. క్లైమాక్స్ కచ్చితంగా షాకింగ్ గా అనిపిస్తుంది. ఓరకంగా చెప్పాలంటే.. క్లైమాక్స్ రాసుకొని, ఆ తరవాత అల్లుకొన్న కథ ఇది. చిత్రబృందం కూడా ఆ క్లైమాక్స్ నే బలంగా నమ్మింది. కచ్చితంగా పతాక సన్నివేశాలు `హార్ట్` హిట్టింగ్‌గా అనిపిస్తాయి. ఈ విషయంలో ఎలాంటి డౌటూ లేదు.
కాకపోతే.. సినిమా అంటే క్లైమాక్స్ ఒక్కటే కాదు. చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రేమకథలో సన్నివేశాలు కొత్తగా పండాలి. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుండాలి. పాటలు కుదరాలి. మనసుల్ని కదిలించే ఘట్టాలు ఉండాలి. ఇవన్నీ `రాజు వెడ్స్ రాంబాయి`లో ఉన్నాయా… అని అడిగితే సమాధానం టక్కున చెప్పలేం. హీరో, హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే. చూడ్డానికి ఈ జోడీ బాగుంది. వాళ్ల మొహాల్లోనే అమాయకత్వం కనిపిస్తోంది. కాబట్టి కెమిస్ట్రీ విషయంలో లోటు లేదు. కానీ ఆ జోడీ నుంచి పుట్టుకొచ్చే సన్నివేశాలు అంత సహజంగా కుదర్లేదనిపిస్తుంది. రాజు, రాంబాయ్ ల ప్రేమకథలో ఎలాంటి ఉద్వేగమూ ఉండదు. జస్ట్… రొటీన్ లవ్ స్టోరీ అంతే. రాంబాయి రాజుని ఎందుకు ప్రేమిస్తుంది? అని అడిగితే దానికి సమాధానం దొరకదు. వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) పాత్ర చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. కానీ తన యాక్టివిటీస్ అంత భయం కలిగించవు. వెంకన్న చేతిలో ఈ జంట ఏమైపోతుందో అనే భయం, ఉత్కంఠతను ఆ పాత్ర కలిగించలేకపోయింది. దానికి కారణం.. రైటింగ్ లో ఉన్న బలహీనతే. విలన్ పాత్రని చూస్తే భయం పుట్టాలి తప్ప.. చిరాకు, అసహనం కాదు. వెంకన్న పాత్రలో ఆ రెండూ ఉన్నాయి. ఇంటికొచ్చి, కూతుర్ని ఓ కుర్రాడు కొడితే.. ఆ తండ్రి కడుపు రగిలిపోతుంది. హీరో ఇంటికి వెళ్లి వెంకన్న ఎంత విధ్వంసం సృష్టిస్తాడో అనిపిస్తుంది. కానీ ఆ సీన్ చాలా పేలవంగా ముగించాడు దర్శకుడు. హీరో పాత్రపై కూడా అప్పుడప్పుడూ కోసం వస్తుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ ని కొట్టినప్పుడు. ఇలాంటి మూర్ఖుల్ని ఏ అమ్మాయి అయినా ఎందుకు ప్రేమించాలి? అనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ పై సానుభూతి కోల్పోయే ప్రమాదం తీసుకొచ్చిన సీన్ అది. అలాంటప్పుడు ఆ పాత్రతో ప్రేక్షకుడు ఎలా ట్రావెల్ అవుతాడు? తన ప్రేమ గెలవాలని ఎందుకు కోరుకొంటాడు?
కథలో ఎలాంటి ఎమోషన్ పండడం లేదనుకొన్నప్పుడు, కథ ముందుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుంది అనుకొంటున్నప్పుడు ఓ పాత్రని అర్థాంతరంగా చంపేయడం స్క్రీన్ ప్లేలో ఒక టెక్నిక్. దాన్ని ఈ సినిమాలో పాటించాడు దర్శకుడు. హీరో తండ్రి (శివాజీరాజా) పాత్రని అంత సడన్‌గా ముగించారో అర్థం కాదు. కేవలం సానుభూతి పొందడానికా, ఇంట్రవెల్ కార్డు కోసమా? 2010లో జరిగే కథ ఇది. అప్పటి వాతావరణం చూపించడానికి, యూత్ ఆలోచనలు అర్థమయ్యేలా చెప్పడానికీ.. బ్లూ ఫిల్మ్స్ కోసం వెంపర్లాడడం మాత్రమే చూపించాల్సిన పనిలేదు. అందుకు చాలా మార్గాలున్నాయి. ఎయిటీస్ కిడ్స్ అంటే.. అస్తమానూ అవేనా, అంతకు మించి ఏం ఉండవా? అనిపించింది ఈసినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.
ఫస్టాఫ్‌లో కొన్ని మంచి మూమెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని యూత్ ఎంజాయ్ చేయొచ్చు. అమ్మాయి చెప్పులు అబ్బాయి వేసుకొని భావోద్వేగానికి లోనవ్వడం ఓ గొప్ప సన్నివేశం. ఆ సీన్ ఇంపాక్ట్బుల్ గా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు దర్శకుడు బాగానే రాసుకొన్నాడు. ఎలాంటి సీన్లు పడితే.. ఆడిటోరియం ఎలెర్ట్ అవుతుందన్న విషయంలో దర్శకుడికి ఓ క్లారిటీ వుంది. అలాంటి సీన్లే రాసుకొన్నాడు. కానీ అందులో బలం సరిపోలేదు. రైటింగ్ పరంగా తనకు సపోర్ట్ దొరికి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా చేసిందే క్లైమాక్స్ కోసం. దాని కోసమే మిగిలిన కథంతా నడిపారు. నిజంగానే ఆ క్లైమాక్స్ కల్లోలంగా అనిపిస్తుంది. మనసు డిస్ట్రబ్ అవుతుంది. ఓ ప్రేమ జంటకు నిజంగా ఇలాంటి అన్యాయమే జరిగిందని తెలిస్తే.. మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా అనే భయం కూడా వేస్తుంది. రాజు, రాంబాయి లాంటి ప్రేమికులు ఉన్నారని తెలిసినప్పుడు ప్రేమపై ఇంకాస్త నమ్మకం ఏర్పడుతుంది.
నటీనటుల పరంగా ఎవ్వరూ తక్కువ చేయలేదు. హీరో, హీరోయిన్లు అందంగా కనిపించారు. అత్యంత సహజంగా నటించారు. అన్ని రకాల ఎమోషన్స్ పలికించగలిగారు. తెలంగాణ యాస కూడా అందంగా పలికారు. తేజస్వీరావు ఇచ్చిన కొన్ని ఎక్స్ప్రెషన్స్ మరింత ముద్దుగా ఉన్నాయి. చైతన్య కు ఇది ఛాలెంజింగ్ రోల్. తను బాగానే రక్తికట్టించాడు. కానీ.. రైటింగ్ లో లోపం వల్ల ఈ పాత్రకు రావాల్సినంత మైలేజీ రాకుండా పోయింది. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో అంతా బాగానే చేశారు. శివాజీరాజా నటన నేచురల్ గా కుదిరింది. కాకపోతే ఆ పాత్రకు ఇచ్చిన అర్థాంతరపు ముగింపే.. కదలించలేదు.
చిన్న సినిమా అనే ఫీలింగ్ రాకుండా టెక్నికల్ టీమ్ గట్టి సపోర్ట్ చేసింది. ముఖ్యంగా ఆర్.ఆర్..ని మెచ్చుకోవాలి. పాటల్లో ఒకట్రెండు మళ్లీ మళ్లీ వినేలా ఉన్నాయి. కెమెరా వర్క్ నీట్ గా వుంది. తెలంగాణ పల్లెటూరిని చాలా అందంగా చూపించారు. ముందే చెప్పినట్టు దర్శకుడికి ఎలాంటి సినిమా తీయాలి, అది ఎలా తీయాలి అనే విషయంలో క్లారిటీ వుంది. ప్రయత్నంలో నిజాయతీ ఉంది. తన అనుభవంలోకి వచ్చిన ఓ అరాచకాన్ని డాక్యుమెంటరీ చేద్దామనుకొన్నాడు. అదే చేశాడు. కానీ ఆ ప్రయాణంలో తన బలం సరిపోలేదు. హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ ని నమ్మి తీసిన సినిమా ఇది. కేవలం అదొక్కటే సినిమాని గట్టెక్కించదు. యూత్ కి ఈ సినిమా ఎంత వరకూ కనెక్ట్ అవుతుందన్న విషయంపైనే ఈ సినిమా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మాత్రం లవ్ స్టోరీ సరిపోతుందే అనుకొంటే.. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కూడా నిలబడుతుంది. వాళ్లకి కూడా క్లైమాక్స్ ఒక్కటే పట్టితే… మిగిలిన సినిమా అంతా భారమైపోతుంది.
తెలుగు360 రేటింగ్: 2.5/5
– అన్వర్
