రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని.. ఆయన తనను తాను మునుగోడు సీఎంగా ప్రకటించేసుకున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఏం జరిగినా అది తాను పెట్టిన రూల్స్ ప్రకారమే జరగాలని లేకపోతే లేదని అంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఏవీ తన నియోజకవర్గంలో చెల్లవని అంటున్నారు. మితిమీరిపోతున్న ఆయన తీరు చూసి మునుగోడు జనం కూడా ఇదేం వైపరీత్యం అనుకుంటున్నారు.
మద్యం దుకాణాలకు సొంత రూల్స్
మద్యం దుకాణాలకు సొంత రూల్స్ పెట్టారు. మునుగోడులో దుకాణాల కోసం ఎవరైనా అప్లికేషన్లు వేయాలంటే ముందుగా తన రూల్స్ గురించి తెలుసుకోవాలని మొదట్లోనే హెచ్చరికలు జారీ చేశారు. లేకపోతే దుకాణాలు తెరువనిచ్చేది లేదన్నారు. ఇప్పుడు దుకాణాలు ప్రారంభించే సమయం వచ్చే సరికి అందరికీ అవే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తన రూల్స్ పాటించకపోతే దుకాణాలు ఇచ్చేసి వెళ్లిపోవాలని అంటున్నారు.
ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆటంకాలు
రీజనల్ రింగ్ రోడ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు రాజగోపాల్ రెడ్డి అడ్డం పడుతున్నారు. భూసేకరణకు వ్యతిరేకం అంటూ రైతుల్ని కూడగట్టి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అసలు రీజనల్ రింగ్ రోడ్డే మునుగోడు నుంచి వద్దన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని ఏదో విధంగా వ్యతిరేకించాలి.. పనులు ఆపాలన్న టార్గెట్ తోనే ఆయన ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.
రేవంత్ ఇతర లీడర్లను ప్రోత్సహిస్తారని అభద్రతా భావం
రాజగోపాల్ రెడ్డి ఇలా ఎందుకు చేస్తున్నారో కానీ ఆయన రేవంత్ రెడ్డి తనకు ప్రత్యామ్నాయంగా ఇతరుల్ని ప్రోత్సహిస్తారని అనుమానిస్తున్నారు. అందుకే తన నియోజకవర్గంలోకి ఎవరూ రావొద్దని ఆయన అంటున్నారు. నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ.. తాను ఏం చేసినా నియోజకవర్గం కోసమే అని చెప్పడం ప్రారంభించారు. కానీ రేవంత్ తరపున ఇప్పటికే కొంత మంది లీడర్లు మునుగోడుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. అదే ఆయనలో అసహనాన్ని పెంచుతోందని చెబుతున్నారు.
